Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన హామీలు నెరవేర్చని కేంద్ర ప్రభుత్వం
- ప్రధాని మోడీ ప్రభుత్వం వల్ల రూపాయి విలువ పడిపోయింది
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ-జఫర్గడ్
నరేంద్ర మోడీ ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చని ప్రభుత్వం అని, ఇది అడగని బీజేపీ రాష్ట్ర నాయకులు చవట దద్దమ్మలు అని మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. మండలంలోని తమ్మడపల్లి ఐ గ్రామంలో ఆదివారం బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ గాదే పాక అనిత సుధాకర్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పైసా సాయం చేయలేదన్నారు. అభివృద్ధికి సహకరించకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హౌదా ఇవ్వడం లేదన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక ఉచితాలు వద్దు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని మాట్లాడం సరికాదన్నారు. బడా కార్పొరేట్ సంస్థలు బ్యాంకులలో రుణాలు తీసుకొని ఎగ్గొడితే వారి రుణాలు 12 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. బీజేపీ పాలనలో ఆర్థికవ్యవస్థ వెనుకబడిందన్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తున్నదన్నారు. ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్‌గా ఉందని అన్నారు. 46 లక్షల ఆసరా పింఛన్లు వచ్చాయని, మిగతావారికి కూడా అందిస్తామన్నారు. రైతు బంధు పథకం కింద రూ.14 వేల కోట్ల సహాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. 18 లక్షల దళిత కుటుంబాలు రాష్ట్రంలో ఉంటే ప్రతి కుటుంబానికి రూన10 లక్షల ఆర్థిక సాయం అందించాలంటే రూ.1.85 కోట్లు అవసరం అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడి ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తుందన్నారు. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, సర్పంచ్ అనిత సుధాకర్ బాబు, సువర్ణ అయోధ్య, గోనె జయపాల్ రెడ్డి, మంద మల్లయ్య, బాదావత్ దేవి రవి నాయక్, మాజీ ఎంపీపీ అయోధ్య, రూరల్ రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకన్న, జిల్లా నాయకులు రాజేష్‌నాయక్, మోహన్‌రావు, ఎంపీటీసీలు ఎడ్ల వెంకటస్వామి, బాదావత్ దేవేందర్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.