Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
- రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్
- సంఘం 2వ మండల మహాసభ
నవతెలంగాణ-కురవి
కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. ఆదివారం కురవి మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రెండవ మండల మహాసభ మల్లాడి కోటయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పోతినేని సుదర్శన్ హాజరై మాట్లాడారు. మూడు నల్ల చట్టాలను తెచ్చి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిిల్లీ నడిబొడ్డున దాదాపు ఏడాదిన్నర పాటు చేసిన పోరాటంతో కేంద్ర ప్రభుత్వం తలొగ్గి మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. ఇది రైతులకు పెద్ద విజయం అని కొనియాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్త్నుదన్నారు. రైతు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని, పోడు భూ ములకు పట్టాలు ఇవ్వాలని, భూ నిర్వాసితుల సమస్యలు, దరణి లోపాలు సవరణకు జిల్లాలో అనేక పోరాటాలు నిర్వహించాలన్నారు. వీటి కొనసాగింపు గా మరిన్ని పోరాటాలకు సిద్దమవ్వాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు గునిగంటి రాజన్న, జిల్లా రైతు సంఘం కార్యదర్శి శెట్టి వెంకన్న, సిఐటియి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు నల్లపు సుధాకర్,కురవి మండల రైతు సంఘం కార్యదర్శి జక్కుల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
సంఘం నూతన కమిటీ ఎన్నిక
మహసభలో సంఘం నూతన కమిటీని పదిహేడు మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రైతు సంఘం అధ్యక్షుడిగా జక్కుల మల్లయ్య, కార్యదర్శిగా నల్లపు సుధాకర్, ఉపాధ్యక్షులు యామిని నర్సింహులు,కట్ల క్రిష్ణ, సహాయ కార్యదర్శిగా మారగాని రాజేష్, ఏడుగురు ఆఫీస్ బ్యారర్లు, తొమ్మిది మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.