Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు
- లైసెన్సుల దుకాణాల్లో కృత్రిమ కొరత
- ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు
నవతెలంగాణ-తొర్రూరు
దసరా పండుగ సమయంలో మద్యం దుకాణాలు జోరుగా సాగుతుంటాయి. వైన్స్ షాప్‌ల వద్ద మద్యం ప్రియుల సందడి నెలకొంటుందని అంతా అనుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. డివిజన్ వ్యాప్తంగా కస్టమర్లు లేక మద్యం షాపులు వెలవెలబోతన్నాయి. మద్యం సిండికేట్ గల్లా పెట్టే మాత్రం కాసులతో నిండుతోంది. ఇందుకు బెల్ట్ షాపులే కారణం. నిర్వాహకులు సిండికేట్ అయి బెల్ట్ షాపుల్లో అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. వైన్ షాపుల్లో పాపులర్ బ్రాండ్ల కు చెందిన మద్యం, బీర్లు స్టాక్ లేకుండా వ్యూహం పన్నుతున్నారు. ఒకటి అరాచోట కనిపించిన కొద్దిసేపటికి నో స్టాక్ కేటగిరీలో చేరిపోతాయి. బెల్ట్ షాపుల్లోనే మద్యం అమ్మకాలు అధికంగా జరిగేలా వైన్స్ లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో పాపులర్ బ్రాండ్ల మధ్య బెల్ట్ షాపుల్లో ఫుల్ స్టాక్ ఉంటుంది. ఇక్కడ పాపులర్ బ్రాండ్లకు చెందిన మద్యం కొనుగోలు చేయాలంటే ఎమ్మార్పీ పై అదనంగా ధర చెల్లించాల్సిందే. ఇలా మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
డివిజన్లోని తొర్రూరు మున్సిపాలిటీలో ఏడు వైన్స్ షాపులు, రెండు బార్లకు అనుమతి ఉంది. అలాగే నెల్లికుదురు మండలంలో మూడు, నర్సింహులపేట లో రెండు దంతాలపల్లి లో రెండు, మరిపెడ లో రెండు, చిన్న గూడూరు లో ఒకటి, పెద్ద వంగర మండలంలో ఒక వైన్స్ షాప్ కు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. కానీ అనధికారికంగా బెల్ట్ షాపుల పేరుతో వందలాది సెంటర్లలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం వైన్స్ లో ఎమ్మార్పీకే మద్యం అమ్మాల్సి ఉంటుంది. అదే దొడ్డిదారిన బెల్ట్ షాపుల్లో అమ్మకాలు సాగిస్తే ఎంఆర్పితో సంబంధం లేకుండా ఇష్టారీతిగా అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీంతో వైన్స్ షాపుల్లో అమ్మాల్సిన మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలించి క్వార్టర్ బాటిల్ పై కనీసం 20 నుంచి 30 రూపాయల వరకు అధిక ధర వసూలు చేస్తున్నారు. ఇక ఫుల్ బాటిల్‌కు రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తూ మద్యం ప్రియులను దోపిడీ చేస్తున్నారు. ఇక పండుగల సీజన్లో అయితే చెప్పనవసరం లేదు. కరోనా తరువాత ఇప్పటికే మూడుసార్లు మద్యం ధరలు పెరిగాయి. ఇప్పుడు వీటికి బెల్ట్ షాపుల అమ్మకాల్లో అదనపు బాదుడు అనివార్యంగా మారి మద్యం బాబుల జేబులకు చిల్లు పడుతోంది.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
వైన్స్ షాపుల్లో పాపులర్ బ్రాండ్ల మద్యం కచ్చితంగా అవ్వాల్సిందే. ఎక్కడైనా పాపులర్ బ్రాండ్ల మద్యం సక్రమంగా అమ్మకుంటే ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేయాలి. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. బెల్ట్ షాపులు నిర్వహించరాదు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం.
- వి శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ, తొర్రూరు