Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూకుమ్మడి రాజీనామాకైనా సిద్ధం : పీఏసీఎస్ వైస్ చైర్మెన్
వతెలంగాణ-శాయంపేట
శాయంపేట పేఏసీఎస్ చైర్మెన్ కుసుమ శరత్ అవినీతికి పాల్పడ్డారని, సిబ్బంది పట్ల దుర్భాషలాడుతున్నారని, ఇదే విషయమై డీసీఓ అధికారులకు ఫిర్యాదు చేశామని, చైర్మన్ చేసిన అవినీతిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే డైరెక్టర్ల అందరితో కలిసి సామూహిక రాజీనామాకైనా సిద్ధమని పీఏసీఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఆదివారం డైరెక్టర్లతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చైర్మన్ శరత్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటివరకు చేసిన లావాదేవీలకు లెక్కలు చూపించడం లేదని, ఎరువుల అమ్మకాలు జరపకపోవడంతో రైతులు సొసైటీ పట్ల అసంతప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ప్రతి సొసైటీ కి 30 లక్షల రుణాలు మంజూరు చేయగా, సొసైటీ చైర్మన్ ఐదు లక్షలు తన దగ్గర ఉంచుకొని, 25 లక్షల రుణాలు మంజూరు అయ్యాయని, చివరి తేదీ సెప్టెంబర్ 30న తమకు తెలియపరిచారని అన్నారు. రుణాలు కూడా లాప్స్ అయ్యే అవకాశం ఉందని, రైతులకు అందకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేండ్లలో సంఘం లావాదేవీలు చూపకుండా చైర్మన్ బంధువుల అకౌంట్లో డబ్బులు వేసుకొని లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలకు పరకాల వ్యవసాయ మార్కెట్ అందించిన టార్ఫాలిన్ కవర్లను వాడుకుని తిరిగి అప్పగించకుండా, ప్రైవేటు డీలర్ల ద్వారా, ఫర్టిలైజర్ షాప్‌ల ద్వారా, సొసైటీ సిబ్బంది ద్వారా ఒక్కొక్క టార్పాలిన్ రూ.1600 చొప్పున విక్రయించాడని ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా భారీగా అవినీతి చేశాడని, గన్ని సంచులను ప్రైవేటు మిల్లు యజమాన్యానికి అమ్ముకున్నారని ఆరోపించారు. సొసైటీ సీఈఓలు మోహన్, లక్ష్మయ్య, లింగమూర్తిని మానసికంగా వేధిస్తూ డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా వేధింపులకు గురి చేయడంతో మోహన్ సస్పెండ్ అయ్యారని అన్నారు. లక్ష్మణ్ విధుల నుండి వెళ్లిపోయాడని, లింగమూర్తి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తు చేశారు. సీఈఓ గా మోహన్‌కు ఆగస్టు 25న ఉత్తర్వులు అధికారులు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు కాపీ తీసుకోలే దన్నారు. విధుల్లోకి తీసుకోవడానికి డైరెక్టర్ సదర్ లాల్ లక్ష రూపాయలు చైర్మన్‌కి లంచం ఇచ్చినట్లు తెలిపారు. చైర్మన్ శరత్ చేస్తున్న అవినీతి విషయా లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి దష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చైర్మన్ చేసిన అవినీతిపై డీసీఓ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేశామని బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు ఎలమంచి జైపాల్ రెడ్డి, మంద మల్లయ్య, వాంకుడోత్ సదర్ లాల్, తోట శ్రీనివాస్, బగ్గి రమేష్, చాడ మహేందర్ రెడ్డి, బూర రమేష్, ధైనంపల్లి వసంత పాల్గొన్నారు.