Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ లావాదేవీలు, పేపర్ లెస్ పనులు..
- పని లేక వీధిన పడుతున్న కార్మికులు
- రుణాల భారంతో సతమతమవుతున్న యజమానులు
నవతెలంగాణ-తొర్రూరు
రోజులు త్వర త్వరగా మారిపోతున్నాయి. పేపర్ లెస్ వ్యవస్థ వచ్చేస్తోంది. సాంకేతిక విప్లవం సాధించిన విజయం ప్రింటింగ్ రంగంలోకి కూడా వచ్చేసింది. ఆన్లైన్ విధానాలు, ఇంటర్నెట్ లోనే సమాచారం, పీడీఎఫ్ రూపంలో పుస్తకాలు, లావాదేవీలన్నీ ఆన్లైన్ లోనే.... దీంతో ప్రింటింగ్ ప్రెస్‌లకు పని లేకుండా పోతోంది. ప్రింటింగ్ పనులు లేక యజమానులు వర్కర్స్‌ను తగ్గిస్తుండడంతో అందులో పని చేసే కార్మికుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి. ఇన్ని రోజులు ప్రింటింగ్ ప్రెస్ లనే నమ్ముకున్న ప్రింటింగ్ ప్రెస్ కార్మికులు పని లేక చేస్తున్న ఉపాధి కోల్పోతూ వీధిన పడుతున్నారు. శ్రమశక్తి నే నమ్ముకున్న కార్మికులు ప్రింటింగ్ రంగంలో వస్తున్న మార్పుల మధ్య నలిగిపోతూ పూట గడవని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇతర రంగాల్లో తమకు ఉపాధి చూపించి ఆదుకోవాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఇందుకు తొర్రూరు మండల ప్రింటింగ్ ప్రెస్కార్మికులే నిదర్శనం. తొర్రూరు మండలంలో 15 ప్రింటింగ్ ప్రెస్‌లు ఉండేవి. దాదాపు 50 మంది కార్మికులు ఈ రంగంలో ఉపాధి పొందేవారు. ప్రస్తుతం ఆరు ప్రింటింగ్ ప్రెస్‌లు మాత్రమే ఉన్నాయి. మిగతావి కొన్ని మూసి వేయగా, మరికొంతమంది ఇతర రంగాలను ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం యజమానులే అన్ని పనులు చేసుకుంటున్నారు. బైండింగ్, డీటీపీ ఆపరేటర్, పేపర్ కటింగ్, ప్యాకింగ్ డెలివరీ నెంబర్ ఇన్ పేపర్ ఇన్ఫోసి వంటి పనులు చేయడానికి వర్కర్స్ ఉండేవారు. రానురాను వత్తి భారంగా మారుతున్న పరిస్థితి. వర్కర్లకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో కార్మికులు ఇతర పనులకు, ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
మనుగడ ప్రశ్నార్థకమే
ప్రింటింగ్ ప్రెస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒక్కో ప్రెస్‌లో దాదాపు అయిదుగురు పనిచేసేవారు. ప్రస్తుతం పని లేక ప్రెస్‌లు మూతపడుతున్నాయి. కార్మికులకు సరైన జీతాలు ఇవ్వలేని దుస్థితిలో తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చర్యలు తీసుకుని యజమానులను, కార్మికులను ఆదుకోవాలి. పనికి వేతనం అన్నట్టుగా పరిస్థితులు మారాయి.
- టి వెంకటేశ్వర్లు, ప్రింటింగ్ ప్రెస్ యూనియన్ అధ్యక్షులు, తొర్రూరు
బైండింగ్ పనులు కూడా లేవు
ప్రింటింగ్ పనులు పక్కన పెడితే బుక్స్, నోట్ బుక్స్, బిల్ బుక్స్, బైండింగ్ చేసే పనులు కూడా ఉండడం లేదు. ఆన్లైన్ బుక్స్, డిజిటల్ బిల్లింగ్ వల్ల బైండింగ్ పని లేకుండా పోతోంది. ప్రింటింగ్ ప్రెస్‌లు నడవడమే గగనంగా మారింది.
వేమిశెట్టి రాము,ప్రింటింగ్ ప్రెస్ యజమాని, తొర్రూరు
ప్రభుత్వం ఆదుకోవాలి
పేపర్ లెస్ విధానం వల్ల ప్రింటింగ్ పనులు ఉండడం లేదు. సంస్థల ప్రచారానికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి ప్రచారం కూడా ఆన్‌లైన్‌లోకి మారుతుంది. దీంతో పోస్టర్లు, కరపత్రాల ప్రింటింగు తగ్గింది. పెళ్లి కార్డుల ప్రింటింగ్ కూడా చాలా తగ్గించి వాట్సప్, ఆన్లైన్ ఆహ్వానాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బ్యాంకుల నుండి తీసుకున్నారు కిస్తీలు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. రుణాలను ప్రభుత్వ మాఫీ చేసి ఆదుకోవాలి.
-రమేష్, ప్రింటింగ్ ప్రెస్ యజమాని, తొర్రూరు