Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 నవంబర్ నాటికి పూర్తి చేయాలి
- నూతన భూ ఆక్రమణలపై కఠిన చర్యలు
- సర్వే, మొబైల్ యాప్ వినియోగంపై అధికారులకు శిక్షణ
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
మొబైల్ యాప్‌లో పోడు భూముల సర్వే నిర్వహణ పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇల్లెందు క్లబ్‌హౌస్‌లో మొబైల్ ద్వారా పోడు భూముల సర్వే నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు, అటవీ బీట్ అధికారులు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, మండల ప్రత్యేక అధికార్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి అటవీ భూమి సాగు చేస్తున్న గిరిజనులకు, మూడు తరాలుగా సాగు చేస్తున్న గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. నూతనంగా అటవీ భూముల ఆక్రమణను ఎట్టి పరిస్థితులలో సహించవద్దని ఆక్రమణలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తమకు అందజేస్తే ఆక్రమణదారులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు భూముల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలకు సంబంధించి 92 గ్రామాల పరిధిలో 75వేల ఎకరాల భూమికి పట్టాలు కోసం 25 వేల దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా నవంబర్ 15 వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి వివరాలు మొబైల్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో వివాదాలకు తావు లేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా భూ సర్వే నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోడు భూముల సర్వే మొబైల్ యాప్ వినియోగం పై అధికారులు వివరించారు. రిజిస్టర్ మొబైల్ నెంబర్ ల ద్వారా లాగిన్ కావాలని, అనంతరం సంబంధిత గ్రామంలోని ఆవాసాలు వారిగా దరఖాస్తులను, అటవీ శాఖ డాటా డౌన్ లోడ్ చేసుకోవాలని శిక్షణలో పేర్కొన్నారు. పోడు భూముల దరఖాస్తుదారుల వివరాలు క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని, సదరు భూమి వద్ద దరఖాస్తుదారులు అందుబాటులో లేకుంటే, వారికి నోటీసు జారీ చేసి వాయిదా వేయాలని, నోటీస్ జారీ చేసిన అనంతరం దరఖాస్తుదారుడు అందుబాటులోకి రాకపోయినా, క్షేత్రస్థాయిలో పంట భూమి లేకపోయినా దరఖాస్తు తిరస్కరించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారిని అందుబాటులో ఉంటే భూమి విస్తీర్ణ వివరాలు, దరఖాస్తుదారిని కుటుంబ ఫోటో, 2 ఆధారాలు (గుర్తింపు కార్డులు), సాక్షాలు, ఇతర అటవీ వివరాలు, జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలని అన్నారు. భూమి విస్తీర్ణంలో 7, 8 చోట్ల మ్యాప్ ద్వారా జియో కో-ఆర్డినేట్స్ తీసుకుని పోలిగన్ డ్రా చేసి మ్యాప్ ఫోటో మొబైల్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. పోడు భూముల సర్వే క్షేత్రస్థాయిలో ఆఫ్‌లైన్ లో సైతం చేయవచ్చని, క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేసిన సమాచారాన్ని ఇంటర్నెట్ అందుబాటులో వచ్చిన తర్వాత సర్వర్ కు తప్పనిసరిగా సింక్ చేయాలని కలెక్టర్ సూచించారు. పోడు భూముల వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాట్లు జరిగితే మొబైల్ యాప్ అన్ఇన్ స్టాల్ చేయవద్దని అలా చేస్తే అప్పటి వరకు నమోదు చేసిన వివరాలు కోల్పోతామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర్, జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య, జెడ్పీ సిఈఓ శోభారాణి, తహశీల్దార్లు, ఎంపిఓలు, ఎంపిడిఓలు, పంచాయతీ కార్యదర్శులు, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.