Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
- జిల్లా కార్యదర్శి ఎండీ గఫూర్ పాషా
నవతెలంగాణ-గోవిందరావుపేట
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి.గపూర్ పాషా పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రెండో మహాసభ గుండు రామస్వామి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వెంకట్‌రెడ్డితో కలిసి మా ట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని వాగ్దానం చేసి రైతులు వ్యవసాయం నుంచి దూరం చేసి కార్పొరేట్ శక్తులకు భూములు అప్పచెప్పాలని చూస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తారని ప్రకటించి నాలుగు సంవత్సరాలు పూర్తయినా రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకులకు పోలేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేయవలసిన పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా రైతులను చైతన్యం చేసి భవిష్యత్‌లో రైతు ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభలో లక్నవరం చెరువుకు గోదావరి నీళ్లు వెంటనే తేవాలని లక్నవరం కాలువల లైనింగ్ పూర్తి చేయాలని ఇటీవల కురిసిన వర్షాలకు శ్రీరాంపతి కాలువ గండ్లను వెంటనే పూడ్చాలని పోడు భూముల్లో కాస్టులో ఉన్న వారం దరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని తీర్మానాలు చేశారు. కార్య క్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు తీగల ఆదిరెడ్డి, కాప కోటేశ్వరరావు, సామ చంద్రారెడ్డి క్యాతం సూర్య నారాయణ, యానాల ధర్మారెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్లు సప్పిడి యాదిరెడ్డి, కన్నోజు సదానందం, పొదిళ్ల చిట్టిబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుండు లెనిన్, వంక రమేష్, మంగ నరసింహ, మోడెం కృష్ణ పాల్గొన్నారు.