Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిద్ర లేమితో ప్రమాదాలు
ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి : ఆర్టీసిలో అధికారుల వేధింపులు తారాస్థాయికి చేరాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా వరంగల్ -2 డిపోలో మహిళా సిఐ అధికారి ఇష్టానుసారంగా కార్మికులతో మాట్లాడుతున్నారు. డబుల్ డ్యూటీ (డిడి)లు వేస్తుండడంతో డ్రైవర్లకు నిద్రలేమితో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గతంలో కంట్రోలర్‌గా ఉన్న రమేష్‌ను బదిలీ చేసిన డిఎం తిరిగి మళ్లీ కంట్రోలర్‌గా నియమించడంతో డ్రైవర్లకు ఉదయం 6.00 గంటలకే డ్యూటీలు వేయాల్సి వున్నా సాయంత్రం వరకు డ్యూటీలు వేయకుండా గంటల తరబడి డిపోలేనే వేచి వుండేలా చేయడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బిపి, షుగర్ వున్న కార్మికులు చెమలు పట్టి అనారోగ్యం పాలైనా వారిని గంట సేపు విశ్రాంతి తీసుకొని డ్యూటీకి వెళ్లాలని బలవంతం చేస్తున్నట్లు కార్మికులు ఆరోపించారు. ఇదిలావుంటే తొర్రూరు డిపోలో కంట్రోలర్‌గా వున్న మల్లన్న (మల్లికార్జున్) చార్ట్ నిర్వహణలో భాగంగా తన వద్ద చిట్టీలు వేసిన వారికే డ్యూటీలు వేస్తూ ఇతర కార్మికులను వేధిస్తున్నారు. ఆర్టీసి అధికారుల ప్రవర్తనతో ప్రమాదాలు సంభవించి ఆర్టీసిపై ప్రజల్లో నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగల సందర్భంగా యూనియన్ల పేరిట కార్మికులకు శుభాకాంక్షలు చెప్పకుండా అధికారులు అడ్డుకోవడం గమనార్హం.
ఆర్టీసి అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారు. ఆర్టీసి డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేస్తూ అనారోగ్యం పాలయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఇలా తరుచూ వేధిస్తుం డడంతో నిద్రలేమితో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆగస్టు 25న ములుగు గట్టమ్మ ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి డ్రైవర్‌తో డబుల్ డ్యూటీ చేయించడమే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. డబుల్ డ్యూటీలు చేయడతో 4 రోడ్డు ప్రమాదాలు ఇటీవలే జరిగాయని చెబు తున్నారు. ఇందుకు వరంగల్-2 డిపో మహిళా సిఐ అధి కారిణి కార్మికులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నదని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులపై అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు అభియోగా లున్నాయి. గతంలో రమేశ్ అనే కంట్రోలర్‌ను ఇతర విభాగా నికి పంపిన అధికారులు తాజాగా మళ్లీ నియమించడంతో పాత పద్దతిలోనే కార్మికులను వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయంలో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబుల్ డ్యూటీలతో డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందులు
వరంగల్-2 డిపోలో ఆర్టీసి అధికారుల తీరు కార్మికు లకు శాపంగా మారింది. అధికారులు ఉద్దేశపూ ర్వకంగానే ఇలా చేస్తున్నారని, తద్వారా ఆర్టీసిపై ప్రజల్లో వున్న నమ్మ కాన్ని కోల్పోయేలా చేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సిఐ, కంట్రోలర్ రమేశ్ ఆగడాలకు అంతు లేకుండా పోయింది. పండ్లు, పాలు, కూరలు తెమ్మంటూ కార్మికులకు వేధించడం పరిపాటిగా మారింది.
ఓఆర్ పడిపోతున్నా పట్టించుకోరేం..
వరంగల్-2 డిపోలో అధికారులు మరీ విచిత్ర విన్యా సాలు చేస్తున్నారు. బస్సులున్నా డ్యూటీలు వేయకుండా డ్రైవర్లను ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు డిపోలేనే వేచి వుండేలా చేస్తూ ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పడిపోయేలా చేస్తున్నారు. ఆర్టీసి అధికారులు ఉద్దేశ పూర్వకంగానే ఆర్టీసిని నష్టాల్లోకి నెట్టేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
తొర్రూరు డిపోలో గిరిగిరి నడుపుతున్న కంట్రోలర్
తొర్రూరు ఆర్టీసి డిపోలో కంట్రోలర్ ఎస్.మల్లికార్జున్ చిట్టీలు నడుపుతూ తన వద్ద చిట్టీలు వేసిన కార్మికులకే డ్యూ టీలు వేస్తున్నారు. చార్ట్‌పై కూర్చొని మరీ చిట్టీ డబ్బులను కార్మికుల నుండి వసూలు చేస్తున్నారు. గిరిగిరి నడుపుతూ తన వ్యాపారాన్ని విస్తరింపచేసుకుంటున్నారు. చిట్టీలు వేసే వారికి వెంటనే డ్యూటీలు వేయడం పరిపాటిగా మారింది. తన వద్ద చిట్టీలు వేయని కార్మికులు డ్యూటీలు వేసే విషయంలో అలక్ష్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయంలో ఆర్టీసి ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో అధికారుల ప్రోద్భలంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.