Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10న కలెక్టర్కు వినతి : టీడబ్ల్యూజేఎఫ్
నవతెలంగాణ-తొర్రూరు
పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల 'డిమాండ్స్ డే' కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన ్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మహబూ బాబాద్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి తాటికొండ సదాశివరావు తెలిపారు. శనివారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వొచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలు వరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కనీసం ఇప్పుడైనా ఇండ్లు లేదా ఇళ్ళస్థలాలు మంజూరు చే యాలని డిమాండ్ చేశారు. స్వరాష్ట్రంలోనైనా తమకు ఇండ్లు, ఇళ్ళస్థలాలు వస్తాయని ఆశించిన జర్నలిస్టులకు ఎనిమిదేండ్లుగా నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము గత ఎనిమిదేండ్లుగా పోరాటం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించు కోకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 'డిమాండ్స్ డే'ను చేపడుతున్నట్లు వివరించారు. డిమాండ్స్ డే రోజున ఇండ్లస్థలాలు, ఆర్టీసీ బస్సు పాసులు, టోల్ గేట్ సమస్యలు, జర్నలిస్టు బంధు, రైల్వేపాసులపై కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు విస్తతంగా పాల్గొనాలని కోరారు. అలాగే జర్నలిస్టులకు ప్రస్తుతం ఆర్టీసీ ఇస్తున్న 75 శాతం రాయితీ సరిగ్గా అమలుకావడం లేదని చెప్పారు. డీజిల్ సెస్, టోల్ గేట్ల ఫీజులతో రాయితీ కేవలం 50 శాతం మాత్రమే అమలవుతున్నదని తెలిపారు. పెరిగిన ధరల నేపథ్యంలో జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాయితీని పూర్తిగా అమలుచేస్తూ బస్సుపాసు సౌకర్యాన్ని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలని కోరారు. పేదలైన జర్నలిస్టులను ఆదుకునేందుకు 'జర్నలిస్టు బంధు' ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కాలంలో ఎత్తేసిన రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలని, రాయితీని వంద శాతానికి పెంచాలని కోరారు. ఈ సౌకర్యాన్ని కూడా జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై టోల్ ఫీజు నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు బందు శ్రీధర్, పంతం సురేందర్, మహమ్మద్ అమీర్, బొమ్మన బోయిన యాకయ్య, వేల్పుల మహేష్, పున్నం సారయ్య, మంకాల శ్రీనివాస్, ధరావత్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.