Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ పరిధిలో 10 ఆస్పత్రులకు నోటీసులు, రెండు సీజ్, కొన్నింటికి నోటీసులు ఇవ్వని వైనం
- సీజ్ చేసిన వాటిపై నిర్ణయం తీసుకోని ఆరోగ్యశాఖ
- ఇంకా పూర్తికాని తనిఖీలు
నవతెలంగాణ-తొర్రూరు
గ్రామాల్లో గల్లీకో క్లినిక్.. పట్టణాల్లో వీధికో ప్రయివేటు ఆస్పత్రి ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తూ పేద ప్రజల ధన, ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీ, ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇన్నాండ్లు మిన్న కుండిపోయిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో కొన్ని ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చి.. రెండు ఆసుపత్రులను సీజ్ చేసి హడావుడి చేశారు. ఆ తర్వాత 'మామూళ్ళే ' అన్న చోద్యంగా తనిఖీలు అనధికారికంగా నిలిపివేసినప్పటికీ... నిరంతర తనిఖీలు కొనసాగుతాయని ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయివేటు ఆస్పత్రిలో, క్లినిక్లపై నిరంతర తనిఖీలు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ప్రజలను నిలువున్న దోచుకుంటున్నాయి. పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నిబం ధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగస్టిక్స్ సెంటర్లలో తనిఖీలు చేయాలని ఆదేశించినా తనిఖీలు మొక్కుబడిగా సాగాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత నెల 24 నుంచి అధికారులు 10 రోజులపాటు తొర్రూరు మున్సిపల్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేకపోవడం, ఇతర నిబంధనలు పాటించకపోవడం గుర్తించి పది ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు ఆసు పత్రులు సీజ్ చేశారు. అనంతరం తనిఖీలు నిలిపే యడంతో మళ్లీ యధా రాజా.. తథా ప్రజా.. అన్న చందంగా మారింది. షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఆస్పత్రులు మూడు రోజుల్లో వివరణ ఇవ్వడంతో పాటు సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. కానీ, తనిఖీలు నిలిపేయడం గమనార్హం.
నోటీసులు ఇచ్చాం
నిబంధనలు పాటించని 10 ఆసుపత్రుల కు, క్లినిక్ లకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. రెండు ఆసుపత్రులను సీజ్ చేసాం. 18 ఆస్పత్రులను తనిఖీ చేసాం. ఇంకా 20 ఆసుపత్రులు తనిఖీలు చేయాల్సి ఉంది. వివరాలను ఉన్నతాధికారులకు సమర్పించాం. ఇకపై కూడా ఆరోగ్య శాఖ నుంచి ఈ తనిఖీలు కొనసాగుతాయి.
-డాక్టర్ మురళీధర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ