Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ- జనగామకలెక్టరేట్
ప్రజా సమస్యలను అధికారులు వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజా విజ్ఞప్తులను స్వీకరించారు. తనకు ముగ్గురు పిల్లలని, ఉండేందుకు నివాసం లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామానికి చెందిన పసులాది ఎల్లమ్మ విజ్ఞప్తి చేశారు. అదే మండలం గూడూరు గ్రామానికి చెందిన జ్యోతి తన తండ్రి చనిపోవడంతో తనకు రావాల్సిన తండ్రి వాటా మూడు ఎకరాలను దాయాదులు తమపేరుతో చేయించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. రఘునాధపల్లి మండలం కోమళ్ళ గ్రామానికి చెందిన వెలిశాల సోమలింగం తన సర్వే నంబర్ 334 అన్నదమ్ముల భూమి జాతీయ రహదారుల కింద తీసుకున్నారని, అందులో తనకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరారు. దేవరుప్పుల మండలం పడమటి తండ గ్రామానికి చెందిన గుళ్లో తిరుపతి తన అనుమతి లేకుండా సర్వేనెంబర్ 126/ఏ/2లో ఎకరం 20 గుంటల సొంత భూమిలో పంచాయతీ అధికారులు బోరు వేశారని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పాలకుర్తి మండలం బొమ్మర గ్రామానికి చెందిన మహేందర్ తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, కేవలం రెండు ఎకరాల వ్యవసాయ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నామని, తనకు రేషన్ కార్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సాధ్యమైనంత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.