Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేజారుతున్న చేతికొచ్చిన మొక్కజొన్న..పత్తి పంట దిగుబడులు
- అపారంగా నష్టపోతున్న రైతులు
నవతెలంగాణ-నర్సంపేట
నిరవధిక వర్షాలు రైతులను నిండుముంచుతున్నాయి..ఆరుగాలం చమటోడ్చి పండించిన పంట దిగుబడి చేజారుతూ తీవ్రంగా నష్టాల ఊబిలో మరో సారి రైతులు చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తీరు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట దిగుబడి ఇటివల కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దయితూ దెబ్బ తింటుంది. కాయ తులిచి పత్తి దిగుబడి చేతికొస్తున్న దశలో చేజారుతుంది.ఈ యేడాది ఏ పంట ఆశజనకంగా లేపకుండా పోయిందని వేలాదిగా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే చివరకు నష్టమే మిగులుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40 నుంచి 50వేలు నష్టవాటిల్లుతుందని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు ఏకరువుపెడుతున్నారు. వరంగల్ జిల్లాలో మొక్కజొన్న పంట 70వేల ఎకరాలు, పత్తి పంట 72 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. కిందటేడాది మిరప పంట తీవ్రంగా దెబ్బతిని రైతులు అపారంగా నష్టపోయారు. మొక్కజొన్న పంటకు కాలం కలిసిరాలేదు. మార్కెట్లో ఆశించిన ధర కూడా లేకుండా పోయింది. ఇక పత్తి పంటపై రైతులు ఆశతో ఈ సారి అధికంగా సాగు చేశారు. రైతులు మక్కలను కళ్లాల్లో, మార్కెట్ యార్డులో ఆరబోసి మార్కెట్లో విక్రయించడానికి సిద్ధం చేస్తున్న తరుణంలో ఇటివల 10 రోజుల నుంచి నిరవధికంగా కురుస్తున్న వర్షాల వల్ల తడిసి నష్టపోతున్నారు. పత్తి పంట పైరు ఆశజనకంగా ఎదిగి కాయలు కాసినా వర్షాల వల్ల పగిలిన కాయలోకి నీరు చేరుకొని చేతికి రావాల్సిన దిగుబడి దెబ్బతింటుంది. కొద్దిసేపు ఎండ మరో కొద్దిసేపట్లో వర్షం ముంచుకొస్తూ మునుపెన్నడు లేనివిధంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఉక్కిరిబిక్కిరి కావాల్సిన వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇలాంటి విపత్కర అనంకూల పరిస్థితుల్లో దిగుబడులు తీవ్రంగా దెబ్బతింటున్నందున ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు సర్వత్రా కోరుతున్నారు.