Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయోమయంలో ఉపాధ్యాయులు
నవతెలంగాణ-పెద్దవంగర
పాఠశాల విద్యావ్యవస్థలో గందరగోళం నెలకొంది. విద్యాశాఖలో ఉన్నతాధికారులు రోజుకో నిర్ణయాన్ని ప్రకటిస్తూ అందర్నీ అయోమయానికి గురిచేస్తున్నారు. ఎవరిని చర్చించకుండా విద్యాశాఖ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉపాధ్యాయుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదం డ్రులను సైతం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన స్థానిక సెలవులు (ఎల్హెచ్-లోకల్ హాలీడే) వినియోగించుకునే విష యంలో కొంతకాలంగా అధికారుల ఆదేశాల్లో స్పష్టత లోపిస్తోంది. కొంత కాలంగా ఉన్నతాధికారులు స్థానిక సెలువులు ప్రకటిస్తుండగా, జిల్లా స్థాయిలో అధికారులు సెలవు లేదని ప్రకటిస్తూ మౌఖిక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. దీంతో జీవో-308 నిర్వీర్యం చేయడమే కాకుండా, ఉపా ధ్యాయ హక్కులను హరిస్తోంది. సంబంధిత ఆదేశాలు కూడా సకాలంలో క్షేత్రస్థాయికి చేరకపోవటంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పాఠశాల స్థానిక సెలవుకు సంబంధించి ఇటీవల మండలంలో చర్చనీయాంశమైంది. ఈ నెల 24న దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు సెలవు ప్రకటించింది. మరుసటిరోజు పలు జిల్లాల్లోని విద్యాశాఖాధికారులు స్థానిక సెలవు ప్రకటించుకున్నారు. కానీ, మహబూ బాబాద్ జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం దానికి భిన్నంగా ఉంది. తొలుత దీపావళి మరుసటిరోజు స్థానిక సెలవు కోసం ప్రధానోపాధ్యాయులు పై అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ పాఠశాల నడపాలని జిల్లా విద్యాశాఖ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా వాట్సాప్ సందేశం పంపించారని అంటున్నారు. దీంతో మండలం లోని పలు గ్రామాల్లో పాఠశాలలు తెరుచుకోలేదు. ఒకసారి విద్యార్థులకు సెలవు ప్రకటించిన తర్వాత అటువంటి ఉత్తర్వులు ఇవ్వటం సరికాదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇతర ప్రభుత్వ శాఖల కంటే భిన్నంగా పాఠశాల విద్యలో పాఠశాల మొత్తానికి సంస్థాగతంగా సెలవు ప్రకటించే విధంగా ఉత్తర్వులు ఉన్నాయి. స్థానిక పండుగలు, తిరునాళ్లు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో కూడా వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకునే హక్కు ఉన్న స్థానిక సెలవుల విషయంలో ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ మౌఖిక ఆదేశాలు జారీ చేయడమేంటని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
పాఠశాలకు స్థానిక సెలవు ఎప్పుడిస్తారు?
జీవో నెంబర్ 308 ప్రకారం ప్రతి ఏడాది స్థానిక అవసరాల దష్ట్యా మూడు రోజులు (స్థానిక సెలవులు) స్వయం నిర్ణయ సెలవులు ప్రకటించే అధికారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉంటుంది. ఎల్హెచ్ను జూన్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలోనే వినియోగించు కోవాలి. దీనికి సంబంధించి ముందస్తుగా పర్యవేక్షణ అధికారుల అనుమతితో ప్రధానోపాధ్యాయులు స్థానిక సెలవును ప్రకటిస్తారు. స్థానిక పండుగలు, తిరునాళ్లు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఈ సెలవును వినియోగించుకునే అవకాశం ఉంది.