Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ మొదటి వారంలో 159 కేంద్రాల్లో...
- 2.18 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ 50 లక్షల గన్నీస్కు... 16 లక్షల సంచులు..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి హన్మకొండ జిల్లాలో గత ఖరీఫ్‌లో 159 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ ఖరీఫ్‌లో 159 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిల అధికారులు నిర్ణయించారు. 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఈ ఖరీఫ్‌లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకున్నట్టు సమాచారం. ఇందుకు 50 లక్షల గన్నీ సంచులు అవసరం కాగా ఇప్పటి వరకు 16.63 లక్షల గన్నీ సంచులు జిల్లాకు చేరాయి. మరో 22 లక్షల గన్నీ సంచులు రానున్నాయి. పాత గన్నీ సంచులను కూడా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 5 సెక్టార్లలో ప్రతి సెక్టార్‌కు 40 వాహనాల చొప్పున 200 వాహనాలకు టెండర్లు పిలిచారు. మరో వారం రోజుల్లో వాహనాలను సమకూర్చుకునే అవకాశముంది.
గత ఖరీఫ్‌లో హన్మకొండ జిల్లాలో గ్రేడ్ ఎ ధాన్యాన్ని 1,03,108 మెట్రిక్ టన్నులు, కామన్ రకం ధాన్యాన్ని 48,864 మెట్రిక్ టన్నులు, మొత్తంగా 1,51,973 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 36,085మంది రైతుల నుండి కొనుగోలు చేశారు. రూ.296.89 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. గత వానాకాలం మాదిరిగానే ఈసారి కూడా 108 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, 51 ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎ గ్రేడ్ ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.2,060, కామన్ వెరైటీ ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.2,040 ధరతో కొనుగోలు చేయనున్నారు. మొత్తంగా 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే లక్ష్యం జిల్లా వ్యవసాయాధికారుల గణాంకాల మేరకు నిర్ణయించారు. కొనుగోళ్లు ప్రారంభమయ్యాక కొనుగోలు కేంద్రాలను పెంచే అవకాశం లేకపోలేదు.
గతంలో మాదిరిగానే...
గత వానాకాలం ధాన్యం కొనుగోలుకు గాను జిల్లాలో ఆత్మకూరు మండలంలో 8, భీమదేవరపల్లిలో 10, దామెరలో 5, ధర్మసాగర్లో 15, ఎల్కతుర్తిలో 11, హసన్‌పర్తిలో 18, ఐనవోలులో 10, కమలాపూర్‌లో 21, కాజీపేటలో 4, నడికూడలో 15, పరకాలలో 7, శాయంపేటలో 15, వేలేరులో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధాన్యం తరలింపునకు 200 వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వానాకాలం కూడా ఇవే కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. వాహనాలను ముందస్తుగా ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచారు.
50 లక్షల సంచులవసరం : మహేందర్, జిల్లా మేనేజర్, సివిల్ సప్లయిస్ హన్మకొండ
వానాకాలం ధాన్యం సేకరణకు హన్మకొండ జిల్లాలో 50 లక్షల గన్నీస్ సంచులు అవసరం. కాగా ప్రస్తుతం 16.63 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయి. మరో 22 లక్షల గన్నీస్ సంచుల కోసం ఇండెంట్ పెట్టారు. దశలవారీగా జిల్లాకు ఈ సంచులు రానున్నాయి. వాహనాలకు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లను పిలిచాం. జిల్లాను 5 సెక్లార్లుగా విభజించి ఒక్కో సెక్టార్‌కు 40 వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం. నవంబర్ మొదటి వారం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేనాటికి వాహనాలను సమకూర్చడం జరుగుతుంది.