Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పశువైద్యాధికారి మనోహర్
నవతెలంగాణ-పాలకుర్తి
లంపీ వైరస్ నుండి పశుసంపదను కాపాడుకునేందుకు రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎస్ఎల్ మనోహర్ సూచించారు. మంగళవారం మండలంలోని తొర్రూరులో పశు గణాభివద్ధి సంస్థ, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని తొర్రూరు సర్పంచ్ నాయిని మల్లారెడ్డి, ఎంపీటీసీ మడిపల్లి కౌసల్య సోమయ్య, మండల పశు వైద్యాధికారి డాక్టర్ మారపెళ్లి శశాంక్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కరోనా వైరస్ తరహాలో లంపి వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోందన్నారు. దీనిని అరికట్టేందుకు దోమలను నివారించాలని సూచించారు. లంపి వైరస్ పట్ల రైతులు ఆందోళన చెందొద్దన్నారు. పశు వైద్యాధికారి శశాంక్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత పశు వైద్య శిబిరంలో 98 పశువులకు వ్యాక్సిన్ అందించామని తెలిపారు. 68 పశువులకు మందులు అందించడంతోపాటు సూడి పరీక్షలు చేశామన్నారు. 48 దూడలకు నట్టల మందు పంపిణీ చేశామని తెలిపారు. పాలకుర్తి మండలంలో 12 గ్రామాల్లో లంపి వైరస్ వ్యాప్తి చెందిందని నివారణకు వైద్య శిబిరాలు చేస్తున్నామన్నారు. పశువుల్లో లంపీ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పశు వైద్యాధికారులతో పాటు అందుబాటులో ఉన్న గోపాల మిత్రలకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీవీ నర్సింహారావు వెటర్నరి యూనివర్సిటీ వైద్యులు ఎం సతీశ్, గోపాలమిత్ర సూపర్వైజర్ వై రాజేశ్వరరావు, గోపాలమిత్ర రాగిరి సమ్మయ్య, బి మధు, సీహెచ్ సమ్మయ్య, ఎం వెంకటయ్య, పాలకుర్తి మండల పశుమిత్రలు. పీవీ నర్సింహారావు వెటర్నరి యూనివర్సిటీ విద్యార్థులు, పాడి రైతులు పాల్గొన్నారు.