Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2.35 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం
- రవాణా కోసం టెండర్లు..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈ సీజన్లో 157 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఆలస్యంగా వరి కోతలు జరుగనుండడంతో కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాస్థాయిలో సన్నాహక సమావేశం నేటికీ నిర్వహించలేదు. గత వానాకాలం సీజన్లో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ సారి 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. గత ఏడాది కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారో, అవే కేంద్రాలను మళ్లీ ప్రారంభించనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల వద్దకు తీసుకువెళ్లడానికి రవాణా ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలిచినా, గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో మళ్లీ టెండర్లను పిలిచే అవకాశముంది. నవంబర్ మాసాంతం నుండి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతుంది. గత సీజన్లో గన్నీస్, రవాణా సౌకర్యంలో తీవ్ర లోపాలు జరుగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని ఈసారి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినవసరం ఎంతైనా వుంది.
వరంగల్ జిల్లాలో వరి కోతలు చివరి దశలో జరుగనుండడంతో ధాన్యం కొనుగోళ్లలోనూ జాప్యం జరుగనుంది. త్వరలో జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి అధికార యంత్రాంగం సన్నాహక సమావేశం నిర్వహించే అవకాశం లేకపోలేదు. గత వానాకాలం సీజన్లో జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాల్లో 1 లక్షా 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించలేదు. కోతలు జిల్లాలో ఆలస్యంగా జరుగనుండడంతో అధికారులు ఇప్పుడిప్పుడే ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. ఈ వానాకాలం సీజన్లో ధాన్యం 2 లక్షల 35 వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సన్నాహక సమావేశంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోనున్నారు. గత సీజన్లో వున్న 157 కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించనున్నారు.
55 లక్షల సంచులవసరం..
ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లాలో ఈ సీజన్లో 55 లక్షల గన్నీస్ సంచులు అవసరం. కాగా ప్రస్తుతం 25 లక్షల సంచులు అందుబాటులో వున్నాయి. సంచులను త్వరితగతిన సేకరించే పనిలో అధికారులున్నారు. గత సీజన్లో గన్నీస్ సంచుల కొరత తీవ్రంగా వచ్చింది. ఈ సీజన్లో గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని సంచుల సేకరణపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి వుంది. సంచుల సేకరణపై సైతం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాల్సి వుంది.
మళ్లీ పిలువనున్న టెండర్లు
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లర్ల వద్దకు ధాన్యం తరలించడానికి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సి వుంది. జిల్లాను 6 సెక్టార్లుగా విభజించగా, ఇప్పటి వరకు 2 సెక్టార్లలోనే రవాణా సౌకర్యానికి సంబంధించిన టెండర్లు వచ్చాయి. మరో 4 సెక్టార్లకు టెండర్లు రాలేదు. దీంతో మళ్లీ టెండర్లు పిలవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సీజన్లో రవాణా సౌకర్యం కల్పించడంలో తీవ్ర లోపాలు జరిగాయి. వాహనాల సౌకర్యం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో రైతులే స్వయంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తరలించిన విషయం విదితమే. ఈ లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారులు సకాలంలో ఏర్పాట్లు చేయకపోవడంతో అటు సంచుల విషయంలో, ఇటు రవాణా విషయంలో రైతులు వ్యయప్రయాసాలకు గురి కావాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు ఈ దిశగా ఆలోచించి గన్నీస్ సంచులు, వాహనాలను సరిపోనూ సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలని అధికారులను రైతులు కోరుతున్నారు.