Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ భవేష్ మిశ్రా
- 6615 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యం
- అధికారులు సమన్వయంతో పని చేయాలి
- అంతర్ పంటల సాగుకు ప్రభుత్వ సహకారం
- ప్రతి ఆయిల్ ఫాం ఎకరానికి ప్రభుత్వం రూ.13 వేలకు పైగా సబ్సిడీ
నవతెలంగాణ-భూపాలపల్లి
ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులకు వచ్చే రాబడి వివరాలను సంపూర్ణంగా వివరించి మార్చి చివరి నాటికి ఆయిల్‌ఫాం సాగు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన భూపాలపల్లిలోని ప్రగతి భవన్లో ఆయిల్ పామ్ సాగుపై సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివద్ధికి విశేష కషి చేస్తుందని, ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకం అన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంట క్రింద ఆయిల్ పామ్ సాగు చేయాలని, జిల్లాలో 2022-23 సంవత్సరానికి 6615 ఎకరాల్లో 3 లక్షల 96 వేల 900 మొక్కలు పెంచుట లక్ష్యం కాగా, ఇప్పటి వరకు దాదాపు 298 రైతులకు సంబంధించిన 963 ఎకరాలలో మొక్కలు నాటడం, 453 ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మరో 5622 ఎకరాలలో 1850 రైతుల ద్వారా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలని, వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికా రులు సమన్వయంతో పని చేసి మార్చి చివరి నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలత ఉందన్నారు. 45 రైతు వేదికల క్లస్టర్ల పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు పంట కోతల సమయంలో ఆయిల్ పామ్ సాగుపై సంపూర్ణ సమా చారంతో రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని అన్నారు. ఆయిల్ పామ్ సాగుతో పాటు మొదటి మూడు సంవ త్సరాల పాటు అంతర్ పంటల సాగు వల్ల రైతులు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. దీనిని వ్యవసాయ విస్తరణ అధికా రులు విస్తతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు అంతర్ పంటగా వరి మినహాయించి మొక్క జొన్న, అరటి, పసుపు, మిరప, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ, పెసర్లు, మినుము, అలసంద, పూలు, కూరగాయల వంటి పంటలు సాగు చేయవచ్చనే అంశాన్ని రైతులకు స్పష్టంగా అవగాహన కల్పిం చాలన్నారు. రైతులకు పంపిణీ చేసేందుకు అవసరమైన ఆయిల్ పామ్ మొక్కలు సిద్దంగా ఉన్నాయని, ఆసక్తి గల రైతులు ఏకరాని 60 మొక్కలు మొక్కకు రూ.20 చొప్పున రూ.1200 డీడీ చెల్లించిన వెంటనే డ్రిప్ పనులు, మొక్కల పంపిణీ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులను గుర్తించి క్లస్టర్ పరిధిలో ఆయిల్ ఫామ్ సాగు అధికంగా జరిగేలా కషి చేయాలని, వీటి వల్ల కలిగే లాభాలను స్పష్టంగా వివరిస్తే అధిక సంఖ్యలో రైతులు ముందుకు వస్తారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశా రు.ఆయిల్ పామ్ సాగు వల్ల 4వ సంవత్సరము నుంచి ఎకరానికి లక్షకు పైగా ఆదాయం వస్తుందని, నాటిన ఆయిల్ పామ్ మొక్కను 3 నుండి 4 సంవత్సరాలు కాపాడుకుంటే 30 సంవత్సరాల పాటు మన కుటుంబానికి జీవనోపాధి కల్పిస్తూ ఆయిల్ పామ్ సాగు తోడ్పాటు నిస్తుందని, కోతుల బెడద, ఇతర జంతువుల నుండి ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. జిల్లాలో సువెన్ ఆగ్రో ఇండిస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రైతులకు మొక్కలు సరఫరా చేయడంతో పాటు మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతుకు భారం కాకుండా రవాణా ఖర్చులు కూడా సంస్థనే భరిస్తుందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు 213 రూపాయల విలువ గల మొక్కను ప్రభుత్వం 193 రూపా యల సబ్సిడీతో కేవలం 20 రూపాయలకు అందిస్తుందని, అంతేకాకుండా ప్రతి సంవత్సరం రూ.4,200 చొప్పున నాలుగు సంవత్సరాలకు 16 వేల 800 రూ పాయలు అంతర్ పంటకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఎకరానికి రూ.1200 డిడిలు నవంబర్ లోగా చెల్లించాలని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఏర్పాటు కు ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బి.సి లకు 90 శాతం, ఓ.సి. లకు 5 ఎకరాల లోపు 90 శాతం, 5 ఎకరాలు దాటితే 80శాతం డ్రిప్ సబ్సిడీ అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఆయిల్ పామ్ సాగు కోసం ఎకరానికి ప్రభుత్వం అందించే సబ్సిడీ, అంతర్ పంటలకు ప్రభుత్వ సహాయం, అంతర్ పంటల ద్వారా వచ్చే ఆదాయం, 4వ సంవత్సరం నుంచి వచ్చే ఆయిల్ పామ్ ఆదాయం వివరాలను విస్తతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అనంతరం ఆయిల్ పామ్ సాగు పై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సంజీవ్ జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్, సువెన్ ఆగ్రో ఇండిస్టీస్ ఎండి గౌతమ్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏ.ఓ.లు, ఏ.ఈ.ఓ.లు, హార్టికల్చర్ అధికారులు, ఆయిల్ ప్లం ఎక్స్టేషన్ అధికారులు, మైక్రో డ్రిప్ ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.