Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
విభజన హామీలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని తక్షణమే ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ రాంనగర్‌లోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన హామీలు అమలుపరచని ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వెంటనే మంజూరు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేస్తూ ప్రజల నడ్డి విరుస్తుందని, ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు కార్మికులకు పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగులు రమేష్ మాట్లాడుతూ కాజీపేట హైదరాబాదు ఇండిస్టియల్ కారిడార్‌ను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్టు తెలంగాణలో కూడా రూ.21వేల కనీస వేతనం అమలు చేయాలని, స్కీం వర్కర్లు ,అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని ఈ సందర్భంగా మహాసభ తీర్మానాలు చేసిందని తెలిపారు.