Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘనపూర్
ఉపాధి హామీ పనులను గుర్తించి, కూలీల సంఖ్య పెంచాలని జిల్లా అంబుడ్స్‌మెన్ అధికారి గాదెపాక రాజు కోరారు. గురువారం మండలంలోని తానేదార్ పల్లి గ్రామంలో సర్పంచ్ గాదె చంద్రయ్య అధ్యక్షతన ఉపాధి హామీ పనులపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీల డబ్బులు రావడం లేదని, కూలీలు తెలుపగా స్పందించి ఉపాధి డబ్బులు, మరుగుదొడ్ల డబ్బులు రాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, ఉపాధి హామీ పనులలో పని కల్పించక పోయినా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎంపీడీఓకు తెలపాలన్నారు. పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న పనులపై నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామసభలో గ్రామ పంచాయతీ తీర్మానించిన పనుల పరిష్కారంలో జాప్యం ఏర్పడుతుందని ఈ సమస్యలపై అధికారుల చేత విచారణ జరిపించి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తుడు బత్తిని అశోక్ 3 నెలల క్రితం ప్రజావాణిలో కలెక్టర్‌ను ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తానేదార్ పల్లి గ్రామము నుంచి నమిలిగొండ గ్రామం వెళ్లే రోడ్డు 33 ఫీట్ల రోడ్డు ఇప్పుడు 10 ఫీట్లు మాత్రమే రోడ్డు మిగిలిందని ఆ ఇరుకులోనే చెట్లను నాటడం జరిగిందని, రోడ్డును వెడల్పు చేసి చెట్లు నాటాలని కోరగా ఏపీవో ప్రేమయ్య రోడ్డును పరిశీలించారు. 33 ఫీట్ల రోడ్డుకు బదులు ప్రస్తుతం 10 ఫీట్లు మాత్రమే ఉందని పై అధికారులు స్పందించి 33 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేస్తే రోడ్డుకు ఇరుప్రక్కల మొక్కలు నాటుతామని తెలిపారు. వాటర్ షెడ్డు నిర్మాణంలో కూడా లోటుపాట్లను సరిచేయాలని లేనిపక్షంలో సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ పోరాటం చేస్తామని అశోక్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకట రమణ, టీఏ సునీత, ఫీల్డ్ అసిస్టెంట్ అంగిడి కవిత, గ్రామస్తులు బత్తిని అశోక్, గడెం కొమురయ్య, బాస్కుల ఆరోగ్యం, కష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.