Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ-వరంగల్
ఎఫ్ఎస్టిపి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా పరిధి 44వ డివిజన్ అమ్మవారిపేటలో 150 కే.ఎల్.డి. సామర్ధ్యంతో నూతనంగా నిర్మిస్తున్న మానవ వ్యర్ధాల శుద్ధికరణ కేంద్రం నిర్మాణ పనులను మేయర్ గురువారం పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా 10, 15 కేఎల్డిల సామర్థ్యంతో ఇప్పటికే రెండు వివిధ సాంకేతిక పద్ధతుల్లో మానవ వ్యర్ధాల శుద్ధికరన ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. వీటికి తోడుగా సోలార్ డ్రైయింగ్ సాంకేతికను ఉపయోగించి వ్యర్ధాలను శుద్ధికరించడానికి ఈ ప్లాంట్లకు సమీపంలో మహా నగరం నుండి 2035 సంవత్సరం వరకు వెలుబడే వ్యర్ధాలను శుద్దికరించే విధంగా నూతనంగా 150 కేఎల్డి సామర్థ్యంతో ప్లాంట్, నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సాంకేతికత ద్వారా శుద్ధికరణ జరుగుతున్న కేంద్రంలో పర్యటించిన మేయర్ శుద్దికరణ ద్వారా ఏర్పడ్డ అంత్య ఉత్పన్న ఎరువును రైతులకు అందజేస్తున్న వివరాల రికార్డును మేయర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, ఈ ఈ సంజయ్ కుమార్, సానిటరీ సూపర్వైజర్ భాస్కర్, సానిటరీ ఇన్స్పెక్టర్ యాదయ్య, ఆస్కీ ప్రతినిధులు రాజమోహన్,అవినాష్,ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.