Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
అటవీ సంరక్షణ నియమాలను ఉపసంహరించుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ చట్టం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు అన్నారు. సాయుక్త కిసాన్ మోర్చా ఆదివాసి హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఛలో రాష్ట్రపతి భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలోని ఏజెన్సీలో కొత్తగూడెం, కోయగూడెం, నర్సాపురం, కొత్త గుంపు గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మతోన్మాద బిజెపి మోదీ సర్కార్ అటవీ సంరక్షణ 2022 నియమాల పేరుతో ప్రవేశ పెట్టిన బిల్లును, కేంద్ర విద్యుత్ సంస్కరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి గ్యారంటీ చట్టం చేయాలని, పోడు సాగు రైతులందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దరఖాస్తు పెట్టుకున్న రైతులకు పట్టాలివ్వకుండా గత 40, 50 సంవత్సరాలుగా పోడు సాగు చేస్తున్న ఆదివాసి గిరిజన, గిరిజనేతర పేద రైతుల భూములను ఆక్రమిస్తున్నారని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పూనం బిక్షం, బానోతు హౌలీ, మోకాళ్ళ రమేష్, బిరియాని ఏసుదాస్, పొడుగు వెంకన్న, మోహన్ రావు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.