Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడి, ఐటీ, సీబీఐ దాడులతో ఫెడరల్ వ్యవస్థ దుర్వినియోగం
- గవర్నర్ల వ్యవస్థ రద్దు కోసం 7న ఛలో రాజ్ భవన్
- బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని
- బీజేపీపై వైఖరి మారకుంటేనే టీఆర్ఎస్ తో పనిచేస్తాం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ఎన్నికల కమిషన్ విషయంలో కూడా కొలీజియంవంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకమిషనర్ నియామకంలో కేంద్రం అత్యుత్సాహం ప్రదర్శించిందని, స్వయంగా సుప్రీంకోర్టు నియామకాన్ని తప్పుపట్టిందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎనిమిదేండ్లలో ఎనిమిది మందిని ఎన్నికల కమిషనర్లను మార్చిందని, అందుకే ఈసికి కూడా కొలీజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈసి,ఈడి,సిబిఐ,ఐటి లాంటి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థలను మోడీ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలపై,ప్రజాప్రతినిధులపై దాడులను చేయిస్తున్నదన్నారు. దానికి ప్రతిగా రాష్ట్రాలు కూడా ఏసీబీ, విజిలెన్స్ వంటి వాటిని ఉప యోగిస్తూ ప్రతిదాడులకు పాల్పడుతున్నాయని, తద్వారా దేశం లో ఫెడరల్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ అధికార పిపాసిలా తయారయ్యారని, నియంతలా పరిపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రధాని అయిన మోడీ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ప్రతిపక్ష ముక్త్భారత్ అనేలా వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చివేసారని ఆరోపించారు. అక్కడితో ఆగ కుండా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌తో పాటు తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, అందులో భాగంగానే షిండేలాంటి వారు పుట్టుకొస్తున్నారని అన్నారు. మరోవైపు తమ మాటవినని రాష్ట్ర ప్రభుత్వా లపై గవర్నర్ల వ్యవస్థ ద్వారా పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ఈ క్రమంలో ఈనెల 26న తాము రాజ్యాంగపరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, అలాగే గవర్నర్ల వ్యవస్థ రద్దు కోరుతూ డిసెంబర్ 7న సీపీఐ ఆధ్వర్యంలో ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
బీజేపీపై వైఖరి మారకుంటేనే టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తాం
భవిష్యత్‌లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తాం కానీ అది టీఆర్ఎస్ చేతిలోనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ పై టీఆర్ఎస్ ఇలాగే పోరాటం చేస్తేనే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మెంటల్ క్రిష్ణ సినిమా లో పోసానిమురళీకృష్ణకు నకలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని చట్టాలు తెలియని అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసులో అమిత్‌షాను రప్పిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు. అమిత్‌షాకు సిట్ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌రావు హత్యను తాము ఖండిస్తున్నామన్నారు. పోడుభూ ముల సమస్యకు హత్యలు పరిష్కారం కాదని, ప్రభు త్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇండ్ల స్థలాలు, విభజన హామీల కోసం పోరాడుతాం
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వేలాది మం ది పేదలు సీపీఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారందరికీ వందగజాల ఇంటి స్థలం ఇచ్చి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజనసమయంలో ఇచ్చినహామీలైన కాజీపే ట కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు లో గిరిజన యూనివర్శిటీ, మెగా టెక్స్టైల్ పార్క్ సా ధన కోసం సీపీఐ పోరాడుతుందని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు,మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, రాష్ట్ర నాయకులు టి. వెంకట్రాములు, నేదునూరి జ్యోతి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, షేక్ బాష్ మియా, నాయకులు ఆదరి శ్రీనివాస్, మద్దెల ఎల్లేష్, మండ సదాలక్ష్మి, దండు లక్ష్మణ్, ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, కొట్టెపాక రవి,వెంకటరమణ, బి.సంతోష్, ప్రసన్న, శరత్ తదితరులు పాల్గొన్నారు.