Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈఓ కార్యాలయ స్వీప్ కన్సెల్టెంట్ భవాని శంకర్
నవతెలంగాణ-భూపాలపల్లి
నూతన ఓటరు నమోదు, స్విప్ యాక్టివిటీస్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని సీఈఓ కార్యాలయ స్విప్ కన్సెల్టెంట్ భవాని శంకర్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవనం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దివాకర్‌తో కలిసి ఓటరు జాబితా రూపకల్పన, స్విప్ యాక్టివిటీస్ పై ఆయన సమీక్షించి మాట్లాడారు. ఓటర్ నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నదని అన్నారు. 17 ఏండ్లు పై బడిన పౌరులు ఓటర్ కార్డు కోసం ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. యువకులు 18 ఏండ్లు నిండే వరకు వేచి చూడనవసరం లేకుండా, ఇప్పటివరకు జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటరు జాబితాలో నమోదుకు అర్హులు కాగా తాజా నిర్ణయంతో 17 ఏళ్ల వారందరికీ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ట్రాన్స్ జెండర్ల ఓటరు నమోదు పై ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఇందుకు ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ స్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన నిమిత శిక్షణ ఇవ్వాలన్నారు. జాబితా నుంచి ఓటరు తొలగింపు ప్రక్రియ కట్టుదిట్టంగా అమలు చేయాలని, వినూత్న పద్ధతులను అవలంభిస్తూ ఓటర్ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా సెక్స్ వర్కర్ల జాబితా, ట్రాన్స్ జెండర్ జాబితా, దివ్యాంగుల జాబితా ప్రత్యేకంగా తయారు చేయాలని అన్నారు. హెచ్ఐవి నియంత్రణకు పని చేస్తున్న స్వచ్చంద సంస్థలు, జిల్లా వైద్య శాఖ వద్ద ఉన్న సెక్స్ వర్కర్ల జాబితా అందజేయాలని, ట్రాన్స్ జెండర్ ల జాబితా ను జిల్లా సంక్షేమ అధికారి సేకరించాలని సూచించారు. జిల్లాలో అందిస్తున్న దివ్యాంగుల ఆసరా పెన్షన్, సదెరం సర్టిఫికెట్ లు దరఖాస్తుల నుంచి దివ్యాంగులను గుర్తించి వివరాలను ఓటరు జాబితాలో మ్యాప్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమం, స్వీప్ యాక్టివిటీస్ వివరాలు ప్రతి రోజు జిల్లా వెబ్ సైట్లో, సామాజిక మాధ్యమాల్లో నమోదు చేయాలని అన్నారు. లోకల్ కేబుల్ చానెళ్లలో, సినిమా థియేటర్లలో స్క్రొలింగ్, స్లైడ్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈడీఎం, డీపీఆర్ఓను ఆదేశించారు. జిల్లాలో 17 నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరి నుంచి నూతన ఓటరు దరఖాస్తు స్వికరించాలని అన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితా లో గల అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు క్లెయిమ్స్‌కు సంబంధించి దరఖాస్తులను డిసెంబర్ 8 వరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో తెలుపొచ్చని అన్నారు. జిల్లాకు వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటరు దరఖాస్తులను డిసెంబర్ 26 లోపు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రతి డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల స్థాయిలో ప్రత్యేక అధికారులను కేటాయించి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి నమోదు చేయాలని తెలిపారు. ఇక నుంచి ఓటరు జాబితా ఏటా మూడునెలలకోసారి నాలుగుసార్లు అప్డేట్ అవుతుందన్నారు. జాబితా నుండి పేర్లు తొలగించే సందర్భంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా ఒక ఓటరును ఓటరు జాబితా నుండి తొలగించాల్సి వస్తే సంబంధిత ఇంట్లో ఒకరితో ఫామ్ -7 పై సంతకం తీసుకున్న తర్వాతనే తొలగించాలన్నారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లిపోయిన ఓటర్ల తొలగింపు విషయంలో తప్పనిసరిగా ధవీకరణ పత్రం ఆధారంగా తొలగించాలని ఆదేశించారు. ప్రతి వారం ఓటరు నమోదు, తొలగింపు వివరాలను రాజకీయ పార్టీలకు అందచేయాలని సూచించారు. ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ హరినాథ్, వైద్య శాఖ సూపరింటెండెంట్ శ్రీదేవి, డీఈఓ రాజేందర్, ఈడీఎం శ్రీకాంత్, తహసీల్ధార్ మహ్మద్ ఇక్బాల్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.