Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల సంక్షేమమే ప్రధాన ధ్యేయం
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- ఘనంగా సీఐటీయూ జిల్లా 9వ మహాసభ
నవతెలంగాణ-కాశిబుగ్గ
పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. సిఐటియు వరంగల్ జిల్లా 9వ మహాసభ మంగళవారం సిఐటియు వరంగల్, హనుమకొండ జిల్లాల కార్యదర్శులు ముక్కెర రామస్వామి, రాగుల రమేష్ అధ్యక్షతన నగరం లో చార్ బౌలి లోని నోబుల్ ఫంక్షన్ హాల్ (కామ్రేడ్ ఎండి మున్నా నగర్) లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాలడుగు భాస్కర్ ముందుగా సిఐటియు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, విమానయానం, ఇతర సంస్థలను ప్రైవేటు శక్తులకు తాకట్టుపెట్టి కార్మికులకు పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం వల్ల దాని ప్రభావం నిత్యవసర సరుకులపై పడడంతో పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఢిల్లీ కేంద్రంగా రైతులు సంఘటితంగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మికులు ఐక్యంగా ఉంటూ తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సిఐటియు పనిచేస్తుందని అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తున్న బీజేపీ నాయకులు దేశభక్తులు కారని దేశద్రోహులని మండిపడ్డారు. కార్మిక కర్షక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపి కార్మిక వర్గ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను కులమాతాలుగా విడదీసి అధికారంలోకి వస్తున్న పార్టీల పట్ల కార్మికులు ఐక్యంగా ఉండి తిప్పికొట్టాలని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ కోశాధికారి రాములు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రమ, సింగారపు బాబు, అనంతగిరి రవి, అక్కెనపల్లి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ లోకి భారీ చేరికలు
టిఆర్ఎస్ కే వి వరంగల్ జిల్లా నాయకురాలు కాసు మాధవి ఆధ్వర్యంలో మంగళవారం సిఐటియు లోకి భారీగా చేరారు. ఈసందర్భంగా మాధవి మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం సిఐటియు మాత్రమే పోరాడుతుందని అన్నారు.