Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.20 కోట్ల వ్యాపారం
నవతెలంగాణ - వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలలో మద్యం ప్రియులు రూ.20.20 కోట్ల మద్యం తాగారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 జిల్లాలున్నాయి. గత ఏడాది నవంబర్‌లో మద్యం షాపులకు టెండర్లు ఖరారు చేసిన విషయం విదితమే. దీంతో ఆ దుకాణదారుల వ్యాపారం గత ఏడాది డిసెంబర్ నుండే ప్రారంభమైంది. వ్యాపారం తొలిదశ కావడంతో భారీగా సరుకును వ్యాపారులు కొనుగోలు చేశారు. గత ఏడాది డిసెంబర్ 31న రూ.25.09 కోట్ల సరుకును వ్యాపా రులు కొనుగోలు చేయగా, ఈ ఏడాది రూ.20.20 కోట్ల సరుకును కొనుగోలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు జిల్లాల్లో మద్యం వ్యాపారాన్ని పరిశీలిస్తే గత ఏడాది డిసెంబర్ 31 కంటే 2022 డిసెంబర్ 31న మహబూ బాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మాత్రమే మద్యం అధికంగా అమ్ముడుపోయింది. వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లో గత డిసెంబర్ 31తో పోలిస్తే ఈసారి తక్కువ అమ్మకాలు జరిగాయి.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.20.20 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్సైజ్ శాఖకు సంబంధించి 5 జిల్లాలున్నాయి. ఈ ఐదు జిల్లాలను పరిశీలిస్తే ఈసారి గత నూతన సంవత్సర వేడుకల కంటే 2022 డిసెంబర్ 31న మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో మద్యం అమ్మకాలు అధికంగా జరిగాయి. వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గినట్లు కనిపిస్తుంది. 2021 డిసెంబర్ 31, 2022 డిసెంబర్ 31న తీసుకున్న మద్యం సరుకు వివరాలను పరిశీలిస్తే అమ్మకాలు ఏ విధంగా జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. 2021 డిసెంబర్ 31న ఈ ఐదు జిల్లాల్లో రూ.25.09 కోట్ల మద్యం సరుకును వ్యాపారులు డిపోల నుండి కొనుగోలు చేసి విక్రయించారు. 2022 డిసెంబర్ 31న ఈ ఐదు జిల్లాల్లో రూ.20.20 కోట్ల మద్యాన్ని డిపోల నుండి వ్యాపారులు కొనుగోలు చేసి విక్రయించారు. గత డిసెంబర్ 31తో పోలిస్తే ఇప్పుడు రూ. 4.89 కోట్ల అమ్మకాలు తగ్గినట్లు కనిపిస్తుంది. కాని మద్యం వ్యాపారానికి 2021 నవంబర్‌లో లైసెన్స్‌లు ఇవ్వగా, వ్యాపారాన్ని వ్యాపారులు డిసెంబర్ నుండే ప్రారంభించారు. వ్యాపారం ప్రారంభంలో వ్యాపారులు పెద్ద ఎత్తున సరుకును కొనుగోలు చేశారు. ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మహబూబాబాద్, భూపాలపల్లిలో మద్యం అమ్మకాల్లో పెరుగుదల
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో 2022 డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు పెరిగాయి. మహబూబాబాద్ జిల్లాలో రూ.2.34 కోట్ల వ్యాపారం జరిగింది. భూపాలపల్లిలో రూ.2.87 కోట్ల మేరకు వ్యాపారం జరిగింది. 2021 డిసెంబర్ 31న మహబూబాబాద్‌లో రూ.1.74 కోట్లు, భూపాలపల్లిలో రూ.2.77 కోట్ల వ్యాపారం జరిగింది. 2021 డిసెంబర్ 31న వరంగల్ అర్భన్ జిల్లాలో 10.27 కోట్ల వ్యాపారం జరగ్గా, వరంగల్ రూరల్ జిల్లాలో రూ.4.15 కోట్లు, జనగామ జిల్లాలో 6.15 కోట్ల వ్యాపారం జరిగింది. 2022 డిసెంబర్ 31న వరంగల్ అర్భన్‌లో 7.13 కోట్లు, వరంగల్ రూరల్ జిల్లాలో 3.30 కోట్లు, జనగామ జిల్లాలో రూ.4.44 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం.