Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
పోడు భూముల ఆక్రమణలు నియంత్రించి, పోడు భూమిని అందరికీ సమానంగా పంచాలని పోడు సాగుదారులు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన పోడు సాగుదారులు తమకు న్యాయం చేయాలంటూ తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతిక సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన 630 సర్వే నెంబర్లో 100 మంది రైతులకు పైగా సుమారు 100 ఎకరాలకు పైబడి పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, సంబంధిత ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈక్రమంలో అటవీ అధికారులు తమ భూములంటూ సాగులోకి రాకుండా అడ్డుకున్నారని వాపోయారు. సదరు భూమిలో సుమారు 12 ఎకరాలు అప్పటి సర్పంచ్ తాటి రమణ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యుల పేరిట పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ భూమి అసైన్డ్ భూమిని ఎలా పట్టా ఇచ్చారని తాసిల్దారును ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం కింద అసైన్డ్ కమిటీ తీర్మానం ఉన్నది లేనిది తమకు అందించాలని దరఖాస్తు చేసుకోగా వారం రోజుల్లో నివేదిక ఇస్తామని తహసిల్దార్ చెప్పినట్టు వెల్లడించారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా సర్వే చేయించేంత వరకు సంయమనం పాటించాలని తాహసిల్దార్ అల్లం రాజకుమార్ సూచించారు. కాగా తమకు న్యాయం జరగకపోతే సంబంధిత భూమిలో గుడిసెలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. చల్వాయి పోడు సాగుదారులు పిట్టల లక్ష్మి, దయ్యప్ప సరూప, ఊర పెద్ది స్వర్ణలత, గుండ్ల లక్ష్మి, గుంటి కళ్యాణి, భవాని రాధా లక్ష్మి సమ్మక్క నరసింహులు రజనీకర్ గట్టు బాబు సాంబయ్య నరసయ్య సోమయ్య రాము 50 మందికి పైగా రైతులు తదితరులు పాల్గొన్నారు.