Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
గత సంవత్సరం కాలంగా పెండింగ్ లో ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు డబ్బులు చెల్లించాలని, దూర ప్రదేశాలలో కాకుండా సొంత గ్రామాల లోనే పనిని కల్పించాలని జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ పోరిక సమ్మయ్య నాయక్ అన్నారు. శనివారం భూపాలపల్లి మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఆ గ్రామంలో కాకుండా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ రహదారి బాంబుల గడ్డ నుండి మేడిపల్లి వరకు సుమారు 13 కిలోమీటర్ల వరకు ఇరువైపులా చేపట్టిన మొక్కల సంరక్షణ పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోడూరి రమేష్ గుర్రంపేట నాలుగవ వార్డు సభ్యుడు అజ్మీర శ్యామ్ ల తో కలిసి పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గుర్రంపేట గ్రామానికి చెందిన సుమారు 30 మంది కూలీలకు ఆ గ్రామంలో పని కల్పించకుండా కమలాపూర్ గ్రామంలో పంచాయతీ పరిధిలో పనులు చేయిస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ రహదారిపై ఉపాధి కూలీలకు మంచినీళ్లు, నీడ, వైద్య సౌకర్యం కల్పించలేదని ఆరోపించారు. కూలీలను తరలించేందుకు గుర్రంపేట గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను వినియోగించి గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, అదేవిధంగా పెద్దాపూర్ గ్రామపంచాయతీ ట్యాంకర్ ను వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు, పాలకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గుర్రంపేట గ్రామపంచాయతీ పరిధిలో సుబ్బక్క పల్లి సమీపంలో ప్లాంటేషన్ పనుల నిమిత్తం సుమారు 200 మంది కూలీలు గత సంవత్సరం క్రితం పనులు చేపట్టినప్పటికీ ఇప్పటివరకు కూలి డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. గ్రామాల్లో హరితహారం లో నాటిన మొక్కలకు సంరక్షణ కరువైందని ట్రీ గార్డులు లేక నీళ్లు పోయాక మొక్కలన్ని ఎండిపోయాయని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి కూలీలకు కూలి డబ్బులు చెల్లించాలని సొంత గ్రామాల లోని పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారంచుడతామని హెచ్చరించారు. దీనిపై ఏపీవో రాజయ్యను ఫోన్ లో వివరణ కోరగా కమలాపూర్ గ్రామ కూలీలకు పని దినాలు పూర్తి కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు పనులను త్వరగా పూర్తి చేసేందుకు భూపాలపల్లి మండలంలోని పలు గ్రామాల కూలీలతో పనులను చేపట్టడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీ ల ట్రాక్టర్లకు ఈజీఎస్ నుండే డబ్బులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు.