Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్
నవతెలంగాణ-భూపాలపల్లి
కుల మతాంతర వివాహాలతోనే సమ సమాజ స్థాపన ఏర్పడుతుందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ అన్నారు మంగళవారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను సన్మానించారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్ అధ్యక్షత జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి దేవేందర్ పాల్గొని మాట్లాడారు. సమాజంలో కులమతాలను, అడ్డంకులను ఎదురైనా ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని జీవించి సమాజానికి ఆదర్శంగా నిలవడం అభినందనీయమని కొనియాడారు. ఇకపై కూడా పిల్లాపాపలతో ఒకరి నొకరు గౌరవించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. ఎలాంటి కలహాలు లేకుండా సమాజంలోని కుల వివక్ష, మత విభేదాలకు వ్యతిరేకంగా పోరాడి సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. సమాజం లోని విభిన్న కులాలను. మతాలను ఎదిరించి కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వారందరూ ధైర్యవంతులని అన్నారు. వారి స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగాలని, ఇందుకు కేవీపీఎస్ ముందుండి పోరాడుతుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ ప్రజా సంఘాల నాయకులు కులాంతర వివాహాలు సమాజంలోని సామాజిక అసమానతలను రూపుమాపడానికి సమసమాజ స్థాపనకు ఒక మార్గదర్శి లాంటివని అన్నారు. అనంతరం శాలువాలు, కేవీపీఎస్ డైరీలతో కులమతాంతర వివాహాల జంటలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్ రాజేందర్, రాజన్న , రమేష్ , రాజశేఖర్, సుజాత ,మౌనిక, ప్రజా సంఘాల నాయకులు దామెర కిరణ్, రామస్వామి, శ్రీకాంత్, కుల మతాంతర వివాహ జంటలు పాల్గొన్నాయి.