Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం( రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి రవికుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
తునికాకు కూలీలకు పెండింగ్లో ఉన్న తునికాకు బోనస్ చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు బండారి రవికుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పస్రా గ్రామంలో తీగల ఆదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో రవికుమార్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2016 నుండి నేటికీ తునికాకు బోనస్ చెల్లించలేదని, ఇది ఫారెస్ట్ అధికారుల అకౌంట్లో కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయని అన్నారు. గిరిజనులు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పోడు భూములకు రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలు హక్కు పత్రాలు కల్పిస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. వాస్తవంగా అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం కాస్తు కబ్జాలో ఉన్న గిరిజనులకు మూడు తరాలుగా ఉన్న ఇతర పేదలకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. వలస ఆదివాసీలు కూడా 2005 కంటే ముందు కొంతమందికి హక్కు పత్రాలు ఇచ్చారని, వారిని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పదివేల దరఖాస్తులు పెట్టుకున్నారని సర్వేలో రెవెన్యూ భూమి అని వెళ్లడైనట్లు పేర్కొన్నారు. దాదాపు జిల్లాలో 40 వేలకు పైగా ఎకరాలకు రెవెన్యూ భూములల్లో కాస్తుల ఉండి దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్ అయ్యాయన్నారు. ఈ భూముల కాస్తులో ఉన్న వారికి రెవెన్యూ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రత్నం రాజేందర్ ఎండీ అంజాద్ పాషా, జిల్లా కమిటీ సభ్యులు ఎండి దావూద్, ఎండి గఫూర్ పాషా, కొప్పుల రఘుపతి, పొదిల్ల చిట్టిబాబు, దుగ్గి చిరంజీవి, గుంది రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
వాజేడు : తునికాకు సేకరణ బోనస్ బకాయిలు జనవరి నుండి ఫిబ్రవరి నెలాఖరులోగా చెల్లిస్తామన్న అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన అధికారి సీసీఎఫ్ డోబ్రీయల్ హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ములుగు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. వాజేడు మండలంలో ఏర్పాటు చేసిన సంఘం జిల్లా కమిటీ అత్యవసర సమావేశంలో జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య మాట్లాడారు. 2016 నుండి నేటి వరకు బకాయిలు చెల్లించలేదని వాపోయారు. బోనస్ బకాయిలు చెల్లింపులు చేయుంటే జిల్లా వ్యాప్తంగా ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా నాయకులు గొంది రాజేష్, జెజ్జరి దామోదర్, పునేమ్ నగేష్, చిరంజీవి, బచ్చల కష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు.