Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ తూర్పు నియోజకవర్గం భారత రాష్ట్ర సమితిలో ఎన్నడూ లేనంతగా నేతలంతా కలిసి సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొనడం చర్చనీయాం శంగా మారింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్‌కు వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం ఆ పార్టీ శ్రేణుల్లోనే కాక నియోజకవర్గమంతా చర్చకు దారితీసింది. త్వరలో శాసనసభ ఎన్నికలు రానున్న తరుణంలో అందరూ నేతలను కలుపుకుపోయే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే నరేందర్ ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసి అందరు నేతలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 'తూర్పు' నుండి ఈ నేతలంతా బిఆర్ఎస్ టికెట్నాశిస్తున్న విషయం విదితమే. 'తూర్పు' బిఆర్ఎస్లో ఈ ఐక్యతారాగం ఎప్పటి వరకు కొనసాగుతుందో మరీ..వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సీఎం కేసీఆర్ జన్మదినోత్స వేడుకలను మూడ్రోజులపాటు నిర్వహిం చడానికి ఏర్పాటు చేసిన తొలి కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదతరులు హాజరయ్యారు.
ఎమ్మెల్యే ఉత్సవాల్లో మేయర్
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పలు సందర్భాల్లో మేయర్‌ను స్వతహాగా పర్యటించకుండా అడ్డుకున్నారన్న విషయం విదితమే. ఈ క్రమంలో వీరిద్దరి నేతల మధ్య అంతర్గతంగానే కాకుండా బహిరంగంగానే ఈ విభేధాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు మేయర్ గుండు సుధారాణి పాల్గొనడం గమనార్హం. ఇక విభేధాలు సమసినట్టేనా ? లేదా ? అన్న చర్చ మాత్రం కొనసాగు తుంది. ఈ ఇద్దరు నేతల మధ్య వున్న విభేధాలతో ఇప్పటి వరకు కార్పొరేటర్లు, అధికారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇకనైనా సయోధ్య కుదిరినట్టేనా..? లేక మళ్లీ మొదటికొస్తుందా ? అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
కొత్త కూర్పు..?
ఎమ్మెల్యే నరేందర్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ జయంతోత్సవ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వ్యతిరేకవర్గంగా ముద్రపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, రోడ్లు, భవనాల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్ సైతం పాల్గొని పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేశారు. బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో గ్రూపులువారీగా విడిపోయి వున్న విషయం విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి ఇప్పటి వరకు నేతలంతా కలిసి పాల్గొన్న కార్యక్రమం లేదనే చెప్పాలి. ఎమ్మెల్యే నరేందర్‌కు వ్యతిరేకవర్గంగా ముద్రపడ్డ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బిఆర్ఎస్ను వీడి బిజెపిలో చేరిన విషయం విదితమే. ఎమ్మెల్యే నరేందర్‌కు, ఈ నేతలకు మధ్య పలు సందర్భాల్లో తీవ్ర విభేధాలు వ్యక్తమయ్యాయి. పార్టీ కార్యక్రమాలపై దీని ప్రభావం వుంది.
ఐక్యతారాగం కొనసాగేనా.. ?
'తూర్పు' బిఆర్ఎస్లో నేతల మధ్య ఐక్యతారాగం కొనసాగుతుందా ? లేదా ? అన్న చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే నరేందర్ చాలా సందర్భాల్లో మేయర్ గుండు సుధారాణిని సొంతంగా పర్యటించకుండానే అడ్డుకున్నారు. తన నియోజకవర్గంలో మేయర్ పర్యటించినా, ఆ పర్య టనలో కార్పొరేటర్లు పాల్గొనకుండా అడ్డుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో మేయర్ సైతం తన పర్యటనల విష యంలో జాగ్రత్త వహించారు. సంయమనంగా వ్యవహరించి వివాదాలకు కేంద్రంగా మారకుండా జాగ్రత్తపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మెట్టు శ్రీనివాస్‌ల మధ్య తీవ్ర విభేధాలున్నాయి. తొలుత ఎమ్మెల్యే నరేందర్‌కు మెట్టు శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడిగా మెదిలారు. కాలక్రమేణా ఇద్దరి మధ్య తీవ్ర విభేధాలు రావడంతో 'మెట్టు'ను దూరంగా పెట్టారు. దీంతో మెట్టు శ్రీనివాస్ ఎమ్మెల్యే కార్యక్రమాలకు దూరంగా వున్నారు. అనంతరం 'మెట్టు' కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని సాధించుకోవడం ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలో విభేధాలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను మూడ్రోజులపాటు ఎమ్మెల్యే నరేందర్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి విభేధాలను పక్కనపెట్టి అందరు నేతలను ఆహ్వానించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఎడముఖం, పెడముఖంగా వున్న నేతలంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని పార్టీశ్రేణులకు షాక్‌నిచ్చారు. ఈ ఐక్యత ఎప్పటి కొనసాగుతుందో మరీ.