Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎస్పీ సరేందర్రెడ్డి
నవతెలంగాణ-మహాదేవపూర్
జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో మహా శివరాత్రి సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పి జె సురేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కాళేశ్వరంలో పోలిస్ బందోబస్తు ఏర్పాట్లు, వాహనాల మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలు, దేవాలయం వద్ద భద్రత ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం పోలిస్ అధికారులు, సిబ్బందితో సమీక్షించి పలు సూచనలు చేశారు. తెలంగాణతో పాటు, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి రానున్న నేపథ్యంలో ఆలయ సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోలీసుశాఖకు సందర్శకులు సహకరించాలని కోరారు. కాళేశ్వరం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉందని అన్నారు. 200 మంది పోలిస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. పోలిస్ అధికారులు, సిబ్బంది సందర్శకుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. నది ప్రవాహం నేపథ్యంలో ఘాట్ల వద్ద, నిర్దేశిత ప్రదేశాల్లో స్నానాలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, మహాదేవ్ సీఐ కిరణ్, కాళేశ్వరం ఎస్సై లక్ష్మణరావు, మహాదేవపూర్ ఎస్ఐ రాజ్‌కుమార్, జిల్లా పరిధి సీఐలు, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరంలో ఉత్సవాలు ప్రారంభం
మహాదేవపూర్ మండలం లోని కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయంలో శుక్రవారం మహాశివరాత్రి ఉత్సవాలు గణపతి పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వసంత మోహన్ రెడ్డి, ఎంపీటీసీ మమతానాగరాజు, దేవస్థానం ఈవోఎస్ మహేష్, అధికారులు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే కాళేశ్వరంలో గోదావరి ఘాట్ వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
ముస్తాబైన ఆలయాలు
మల్హర్రావు : మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించు కుని మండలంలోని నాచారం గ్రామ పరిధి చిట్టడవి గుట్టల్లో వెలిసిన శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయాన్ని శివరాత్రి బ్ర హ్మౌత్సవాలు నిర్వహించడానికి సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. శుక్రవారం ఆలయ ప్రధాన ఆర్షకులు చెవురి దేవరాజ్ ఆహ్వాన ప్రతులను ఆలయ కమిటీ సభ్యుల కు అందజేసి మాట్లాడారు. నేడు మహాశివరాత్రి కల్యాణోత్స వంతోపాటు ప్రత్యేక కార్యక్రమాలు ఉనిర్వహిస్తామన్నారు. 19, 20న ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సఖ్యలో హాజరై ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.
గణపురం : మండల కేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు మహాశివరాత్రికి ముస్తాబైంది. నేడు గణపేశ్వరాలయంలో శ్రీ శివ కళ్యాణ మహౌత్సవం అంగరంగ వైభవంగా జరగ నుంది. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనపేశ్వరా లయాన్ని ముస్తాబు చేశారు. జాగరణ సందర్భంగా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వైద్య శిబిరం ఏర్పాట్లను డీఎంహెచ్ఓ పరిశీలన
ములుగు : నేటి నుంచి రామప్పలో జరగబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రామప్ప ఆలయ ప్రాంగణంలో ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరానికి కావాల్సిన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా డీఎంహెచ్ఓ అప్పయ్య, స్థానిక ఎంపీడీవో శ్రీనివాస్, ఆలయ కమిటీ మెంబర్లు, అర్చకులు, వైద్య సిబ్బందితో కలిసి పరిశీలించారు.