Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్నీటిపర్యంతమైన ఎమ్మెల్యే సీతక్క
- పలువురి ఘన నివాళి
నవతెలంగాణ - ములుగు
ములుగు గడ్డమీద ప్రజానాయకుడిగా పేరుగాంచిన నల్లెల్ల కుమార్ ఇకలేరు అనే విషయాన్ని జిల్లా ప్రజలు జీర్ణించు కోలేకపోతున్నారు. నాలుగు దశాబ్ధాలుగా ములుగు కేంద్రంలో రాజకీయంగా, ప్రజా సంఘాలతో మమేకమవుతూ ఆటో, జీపు కార్మికులకు అండదండగా ఉంటూ ఏలిన రాజకీయ ఉద్దండుడు నల్లెల్ల కుమారస్వామి అనారోగ్యంతో గురువారం ఉదయం మృతిచెందారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న నల్లెల్ల ఏడాదికాలంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ములుగు పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య విజయకుమారితోపాటు కొడుకు భరత్ కూతురు చైతన్య ఉన్నారు. కాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క నల్లెల్ల కుమారస్వామి మృతదేహంపై పడి రోదించారు. ఆయన లేరనే విషయాన్ని గుర్తుచేసుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. సీతక్క అనుచరునిగా వ్యవహరిస్తున్న నల్లెల్ల కుమార్ మతితో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగి పోయారు. జన వనరుల శాఖ చైర్మన్ వి ప్రకాష్, ఎమ్మెల్యే పెద్ది, కాంగ్రెస్ లీడర్ గండ్ర సత్యనారాయణ, వేం నరేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రామిల్ల రాజేందర్ కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు, మహబూబాబాద్ లీడర్ వేం నరేందర్ తదితరులు కుమారస్వామికి నివాళులర్పించారు.అనంతరం కుమార్ కుటుంబ సభ్యులను పరా మర్శించారు. ములుగు లో నిర్వహించిన అంతిమయాత్రలో పలువురు లీడర్లు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌తో అనుబంధం..
1981లో ఏబీవీపీ అధ్యక్షునిగా విద్యార్థి దశ నుంచి లీడరగా పనిచేసిన నల్లెల్ల కుమారస్వామి 1986లో టీడీపీలో చేరారు. మాజీ మంత్రి చందూలాల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1988లో సర్పంచ్ గా పోటీచేసి ఓడిపోయారు. తదనంతరం 1995లో మళ్లీ సర్పంచ్‌గా పోటీచేసి గెలిచిన కుమారస్వామి 1995 నుంచి 2000వరకు ములుగు సర్పంచ్‌గా పనిచేశారు. 2001లో బీఆర్ఎస్లో చేరి ఎంపీపీగా గెలిచి 2006వరకు పనిచేశారు. కేసీఆర్ ములుగు పర్యటన సందర్భంగా స్థాని కంగా జరిగిన బహిరంగ సభలో కీలకంగా వ్యవహరించి సభ సక్సెస్‌కు కృషిచేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ ములుగు అంటే బీఆర్ఎస్ నేతలతో కూడా నల్లెల్ల కుమార్ బాగున్నాడా అని సీఎం కేసీఆర్ గుర్తుచేస్తారంటే అతిశయోక్తిలేదు. ఆ తరువాత 2006లో కుమారస్వామి భార్య విజయ కుమారి ములుగు సర్పంచ్‌గా గెలిచి 2011దాకా పనిచేశారు. నాలుగు దశా బ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న నల్లెల్ల 2015 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం జిల్లా డీసీసీ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా ములుగుకు అవకాశం కల్పించకపోవడంతో ముందుండి ములుగు జిల్లా ఉద్యమాన్ని నిర్వహింగా 2019లో జిల్లాను ప్రకటించారు. అలాగే హాత్ సేహాత్ జోడో యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనెల 7న ములుగులో కార్నర్ మీటింగ్ అనంతరం స్వయంగా నల్లెల్ల ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని పరామర్శించారు.