Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వీధి కుక్కల పట్ల అప్రమత్తతకై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లు,అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీఎంఏ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వీధి కుక్కల దాడుల పట్ల చిన్న పిల్లలు, ప్రజలను అప్రమత్తం చేయడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. వీధి కుక్కలు సంచరించే ప్రాంతాల్లో జాగ్రత్తలు, రక్షణ పద్ధతులను వివరించాలన్నారు. నగరంలోని ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో కరపత్రాలను పంపిణీ చేయడం, హౌల్డింగ్లు ఏర్పాటు చేయడం బ్యానర్లను ప్రదర్శించడం వంటివి చేపట్టాలన్నారు. స్టేరిలైజేషన్ కేంద్రాలకు కుక్కలను తరలించడానికి అవసరాల మేరకు వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. ఆనిమల్ బర్త్ కంట్రోల్లో భాగంగా మూగ జీవాల పుట్టుకను అరికట్టడానికి వాక్సినేషన్ చేయించాలని తెలిపారు. వేసవిలో కుక్కలకు సరియైన సమయానికి నీరు లభించకపోతే ఒత్తిడికి గురై ప్రజల పై దాడులకు దిగే అవకాశం ఉన్నదన్నారు. జీడబ్ల్యూ ఎంసీ, మున్సిపాలిటీల్లో ఎన్జీఓల సహకారంతో నగరంలోని ప్రధాన కూడళ్ళ వద్ద నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలన్నారు. బస్తీ దవాఖాన ఏర్పాట్లను వేగ వంతం చేయాలని, స్వచ్ఛ సర్వేక్షన్ లో సూచించిన పారామీటర్స్పై ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం నిర్వహణకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలో మొక్కలు పెంచాలన్నారు. డిప్యూటీ కమి షనర్ అనిసర్ రషీద్, ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ఓ డా. రాజేష్, సీిహెచ్ఓ శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ వెంకన్న, వెటర్నరీ డాక్టర్ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.