Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన రహదారులపై నిర్లక్ష్యంగా గోతులు
- ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు
నవతెలంగాణ-హసన్పర్తి
మండల పరిధిలో నిర్వహిస్తున్న టీఫైబర్ కేబుల్ పనులు ప్రజలకు ప్రమాదకరంగా మారాయి. ప్రధాన రహదారులు, ప్రజా సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సదరు కాంట్రాక్టరు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పనులు ప్రజలకు ప్రాణసంకటంగా మారాయని స్థానికులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా నిర్వహిస్తున్న టీ కేబుల్ పనుల నిర్వహణ వల్ల ఎంతో మంది వాహనదారులు, పాదాచారులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే...మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంతంలో జయగిరి క్రాసురోడ్డు మూల మలుపు వద్ద ఇటీవల టీ కేబుల్ ఫైబర్ పనుల కోసం గొయ్యి తీసి వారం రోజులకు పైగా అయ్యిందని స్థానిక షాపుల యజమానులు చెబుతున్నారు. ఈ గొయ్యి ప్రధాన రహదారికి పక్కనే ఉండడం వల్ల ఎంతో ద్విచక్రవాహనదారులు రాత్రి వేళలో గొయ్య కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారని చెబుతున్నారు. గురువారం రాత్రి ఓ ద్విచక్రవాహనదారుడు హన్మకొండ నుంచి జయగిరి క్రాసు రోడ్డు మీదుగా వెళుతుండగా అదుపు తప్పి టీ ఫైబర్ కేబుల్ కోసం తీసిన గొయ్యిలో పడి గాయాలపాలైనట్లు ఆటో యూనియన్ సభ్యులు తెలిపారు. గొయ్యిలో ద్విచక్రవాహనంతో సహా ఇద్దరు వాహనదారులు పడడంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్లు, వివిద షాపుల యజమానులు వారిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా టీ ఫైబర్ కేబుల్ పనుల నిర్వాహకులు, సదరు కాంట్రాక్టర్, సంబందిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.