Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవాసమితి మాజీ సెక్రటరి, ముదిరాజ్ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు బడే పుష్పలత
నవతెలంగాణ-కోల్బెల్ట్
మహిళ ఆదిపరాశక్తి. తాను అనుకుంటే ఏదైనా సాధించగల సత్తా ఉన్న వ్యక్తి. సమాజంలో మహిళ పాత్ర చాలా విలువైనది. అందుకే మహిళల ఉపాధి కోసం సేవా సమితి ఆధ్వర్యంలో అనేక ఉపాధి కార్యక్రమాలు చేపట్టాం.' అనిసేవాసమితి మాజీ సెక్రటరి, ముదిరాజ్ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు బడే పుష్పలత నవతెలంగాణ ముఖాముఖితో వెల్లడించారు. వవరాలు ఆమె మాటల్లోనే...
సింగరేణి సేవా సమితి ఎప్పుడు ప్రారంభమైంది? మీరందిస్తున్న సేవలు, చేపట్టిన కార్యక్రమాలు ?
భూపాలపల్లి ఏరియాలో 2007 వ సంవత్సరంలో సేవా సమితి కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. 2018 నుండి 2022 వరకు నాలుగు సంవత్సరాలు సేవా సెక్రటరీగా సేవలందించాను. మహిళల ఉపాధి కోసం సేవా సమితి ఆధ్వర్యంలో అనేక ఉపాధి కార్యక్రమాలను, గైర్హాజరు ఉద్యోగుల కోసం కౌన్సిలింగ్ కార్యక్రమాల లాంటివి చేపట్టడం జరిగింది.
గనులలో పని చేస్తున్న వారి భద్రత , రక్షణ ఎలా ?
సింగరేణి యాజమాన్యం గనులలో భద్రతాపరంగా చేపడుతున్న కార్యక్రమాలు సంతృప్తికరంగానే ఉన్నాయి. కానీ భార్యామణులు భర్తలను విధులకు ఒక గంట ముందుగానే పంపిస్తే ఆదరాబాదరా లేకుండా, రోడ్డు యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి. అలాగే చిరునవ్వుతో, మంచి మాటలు చెప్పి సాగనంపాలి.
మహిళలకు శిక్షణా తరగతులు, ఉపాధి కల్పన ఎలా?
నా హయాంలో సుమారు 800 మందికి టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్, డ్రైవింగ్ శిక్షణ తదితర కోర్సులలో శిక్షణ తరగతులు నిర్వహించాం. ఇప్పటివరకు వేలాదిమంది శిక్షణ పొందారు. దానిలో ఎక్కువ శాతం మంది ఇళ్లలోనే స్వయంగా వారి కోసం మాత్రమే నేర్చుకున్న శిక్షణను ఉపయోగించుకుంటుండగా, సుమారు 200 మంది టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటిషన్ తదితర కోర్సుల్లో శిక్షణ పొంది ఉపాధి పొందుతున్నారు. సమస్యలంటూ మా దృష్టికి ఏమీ రాలేదు కానీ, శిక్షణ పొంది సర్టిఫికెట్లు పొందిన మహిళలు యూనిట్ల స్థాపనకు ఆర్థికంగా బ్యాంకు లోన్లు కావాలని కోరగా, మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనేకమంది మహిళలు సేవా సమితి ద్వారా ఆర్థిక పరిపుష్టి పొందుతుంటే ఎంతో సంతృప్తికరంగా ఉంది. సేవా సమితి ద్వారా సాధారణ టైలరింగ్, మగ్గం వర్క్ లాంటివే కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ వంటి అధునాతన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము.
అమ్మాయిల కోసం మీరు చేపట్టిన సేవలు?
ప్రత్యేకించి అమ్మాయిల కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు, రానున్న రోజుల్లో వారికి చదువు రీత్యా, ఉద్యోగరీత్యా, అవకాశాల రిత్యా మోటివేషనల్, కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టాలని ఉంది.
సేవా సమితిలో మార్పులు చేర్పులు కోరుకుంటున్నారా?
అవును. గతంలో మాదిరి సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని ఏరియాలలో తయారైన వస్తువులు స్టాల్స్ ద్వారా ఏ ఏరియా లోనైనా అమ్ముకునే అవకాశం, అన్ని ఏరియాలో సేవా సమితి సభ్యులకు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు నిర్వహించాలి.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీ స్పందన?
ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నా, వారి పట్ల అరాచకాలు మాత్రం నానాటికి పెరిగిపోతున్నాయి. కాబట్టి మహిళలు ఎవరికి వారే స్వయంగా అప్రమత్తంగా ఉండడం, మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవడం, సింగరేణి యాజ మాన్యం, ప్రభుత్వాలు, పోలీసులు అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకోవాలి.
సింగరేణి ఉద్యోగులకు, వారి భార్యలకు మధ్య ఏమైనా సమస్యలు తలెత్తితే ?
రకరకాల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటిని మా శక్తి మేరకు అధికారుల సహాయంతో పరిష్కరించగలిగాము. కొందరికి కౌన్సిలింగ్ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరిచ్చే సందేశం?
ఆడది ఆదిపరాశక్తి. తాను అనుకుంటే ఏదైనా సాధించగల సత్తా ఉన్న వ్యక్తి. సమాజంలో మహిళ పాత్ర చాలా విలువైనది. మహిళ ఏ రంగంలో, ఏ స్థాయిలో ఉన్న మొదటిగా తన కుటుంబానికి ప్రాధాన్యత నిచ్చి, చక్కదిద్దుకొని, నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు కనుక తల్లిగా వారికి మంచి బుద్ధులు నేర్పి తద్వారా సమాజాన్ని చైతన్యపరిచి సమ సమాజ స్థాపనకు తోడ్పడాలి.