Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని కాటాపూర్లో నిరుపేద ప్రజలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కాటాపూర్లో అసలే ఇండ్లు లేని నిరుపేదల ఇండ్ల స్థలాల సదస్సు మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కాటాపూర్ గతంలో ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం ఆరున్నర ఎకరాలు భూమి కొనుగోలు చేసిందని, సుమారు రెండు ఎకరాలలో డబుల్ బెడ్ రూములు ఇండ్లు నిర్మించారని, ఇంకా నాలుగు ఎకరాలు ఇంటి స్థలాల భూమి ఖాళీగా ఉన్నదని అన్నారు. దీనిని కొంత మంది ఆక్రమించుకుం టున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇండస్థలాలు ఇచ్చి, ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామ సభ నిర్వహించి అర్హులైన పేదలను గుర్తించి జీవో 58 ప్రకారం ఇండ్ల స్థలాలు ఇచ్చి, వాటికి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. లేంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ప్రభుత్వ స్థలంలో పేదలను సమీకరించి గుడిసెలు నిర్మిస్తామని హెచ్చరించారు. సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల విషయంలో గతంలో స్థానిక తహసిల్దార్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం ఇండ్ల స్థలాల పోరాట కమిటీని అన్ని కులాల నుండి ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ దుగ్గి చిరంజీవి, తాపీ మేస్త్రీల సంఘం(సీఐటీయూ) మండల నాయకులు చిట్టినేని శ్రీనివాస్, నాయకులు బొప్పారపు బాబురావు, అటికే మల్లికార్జున్, పోలే బోయిన రమేష్, రోమన్, గట్టు మల్లయ్య, కాటా నరసింహారావు, మైహిపతి గోపాల్, నరేష్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.