Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనుగల్లులో 30 పడకల ఆసుపత్రి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల,
స్కిల్ ఎక్సెలెన్స్ సెంటర్ : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మహిళల్లో క్యాన్సర్ వ్యాధి పెరుగుతుందని, ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పర్వతగిరి మండలం ఎనుగల్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభకు మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తక్కళ్లపల్లి నారాయణరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మహిళల్లో బ్రెస్ట్, సెర్వికల్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారన్నారు. ప్రతిమ ఫౌండేషన్ వారు తమ స్వగ్రామం ఎనుగల్పై వున్న మమకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఉచిత మెగా క్యాన్సర్ హెల్త్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే ప్రాథమికస్థాయిలోనే వ్యాధిని నివారించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో వుండేదని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ 32 జిల్లాల్లో 32 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అందరికీ వైద్యం అందించాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం వుంటేనే ఆరోగ్యం బాగుంటుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. 240 కోట్ల మొక్కలను తెలంగాణకు హరితహారంలో పెట్టి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నామన్నారు. కరోనాకు కారణమైన చిన్న వైరస్ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. హెలిక్యాప్టర్‌లో వచ్చేటప్పుడు ఈ ప్రాంతమంతా పచ్చగా కనిపించిందని, కాలువల నిండా నీరు పారుతూ కనిపిస్తుంటే రాజ్యసభ సభ్యులు రవిచంద్ర ఈ వూరికి కొద్ది దూరంలోనే మా వూరు వుంటుందని, చెరువులు, కాలువల నిండా నీళ్లు కనపడుతుంటూ సంతో షంగా వుందని చెప్పారన్నారు. కేసీఆర్ అంటే కె అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని, సాగునీరు రైతులకు ఇచ్చి వారికి సీఎం కేసీఆర్ భరోసా నిచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి గత 23 ఏండ్లుగా బోయినిపల్లి వినోద్‌కుమార్, బోయినిపల్లి శ్రీనివా స్రావులు కేసీఆర్‌కు వెన్నంటి వున్నారని, అండగా నిలిచార న్నారు. సొంత తమ్ముళ్ల కంటే ఎక్కువ మద్దతునిచ్చారన్నారు. మా చెల్లి బోయినిపల్లి హారిణి బ్రహ్మాండంగా మాట్లాడిందని, దీంతో మున్ముందు మంత్రి దయాకర్‌రావు, బోయినిపల్లి వినోద్‌కుమార్, అరూరి రమేష్, ముగ్గురు డేంజర్ జోన్లో వున్నట్టేనని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎంతో చెప్పి మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. స్కిల్ ఎక్సెలెన్స్ సెంటర్‌కు భవనాన్ని బోయినపల్లి శ్రీనివాసరావు నిర్మించి ఇస్తామని చెప్పినందునా, ఆ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకుంటానన్నారు. మీ ఎమ్మెట్యే గట్టోడని, ఎమ్మెల్యే అరూరి రమేష్నుద్దేశించి ప్రస్తావిస్తూ చాలా సేపటి నుండి నా చెవులు కొరుకుతు న్నాడని, గడ్డపారతండాకు సాగునీరివ్వడానికి లిఫ్టు అడిగార న్నారు. గీ పేరెవరు పెట్టారు ? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నిం చారు. గడ్డపార తండా ఏంటి..? అంటూ నవ్వారు. చిన్న లిఫ్టు ఏర్పాటు చేసి త్వరలోనే గడ్డపారతండాకు సాగునీ రందిస్తామన్నారు. మీ ఎమ్మెల్యేను కాపాడుకోవాలన్నారు.
ఎనుగల్ను దత్తత తీసుకోవాలి
: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఎనుగల్ గ్రామాన్ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ఎనుగల్ గ్రామం నాకు అండగా నిలిచిందని, వర్ధన్నపేట నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు. ఎనుగల్ గ్రామానికి ఎంత చేసినా తక్కువేనన్నారు. స్వగ్రామం ఎనుగల్పై ప్రేమతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్, ఆయన తమ్ముడు శ్రీనివాస్‌రావు మెగా క్యాన్సర్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని, తద్వారా వ్యాధిని నివారించుకునే అవకాశాలుంటాయన్నారు.
నైపుణ్యకేంద్రం ఏర్పాటు చేయాలి
- బోయినిపల్లి వినోద్‌కుమార్
ఎనుగల్ గ్రామంలో నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్ కోరారు. 15 ఏండ్ల క్రితం నేను హన్మకొండ ఎంపిగా వున్న సమయంలో బసవతారకం ఆసుపత్రికి రూ.2 లక్షలు చెల్లించి భూపాలపల్లిలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 12 మందికి బ్రెస్ట్, సెర్వికల్ క్యాన్సర్‌ను గుర్తించి కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రిలో చికిత్స చేయగా, 8 మంది బతికారని, 4గురు మాత్రమే చనిపోయారని తెలిపారు. వారంతా ఇప్పటికీ మాతో మాట్లాడుతుంటార న్నారు. మా అమ్మ, మా నాయనమ్మ క్యాన్సర్‌తో మృతిచెందారని, అప్పుడే క్యాన్సర్ ఆసుపత్రి పెట్టాలని నిర్ణయించుకొని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
చదువుకుంటే దేశాభివృద్ధిలో భాగమవుతాం..
-డాక్టర్ హారిణి
చదువుకుంటే ప్రతి మహిళా దేశాభివృద్ధిలో భాగమవుతామని ప్రతిమ ఫౌండేషన్ సభ్యురాలు డాక్టర్ హారిణి తెలిపారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కేవలం 18 శాతం మాత్రమే వుందన్నారు. మహిళలు చదువుకుంటేనే అభివృద్ధి చెందుతామన్నారు. వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి, వరంగల్ ఎంపి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులు మాట్లాడారు.