Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు :జె వెంకటేష్
నవతెలంగాణ-భూపాలపల్లి
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో పార్టీ నాయకులు వి రాజయ్య, పోలం రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్లీనరీ సమావేశంలో జిల్లా కార్యదర్శి బందు సాయిలు తో కలిసి వెంకటేష్ హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం లోకి వచ్చిన తర్వాత రైతులు, కార్మికులు అన్ని రంగాల ప్రజలపై దాడిని ప్రారంభించిందన్నారు. ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పెద్ద నోట్లు రద్దు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్తులన్నిటిని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పుతున్నారన్నారు. ప్రజలకు కావాల్సిన నిత్యవసరాల ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో ప్రజల పట్ల అనైక్యతను సష్టిస్తున్నారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి చైతన్యవంతం చేసేందుకు ఈనెల 18న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జన చైతన్య యాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో పాత ఎర్ర చెరువులో గుడిసెలు వేసుకున్న పేద ప్రజలందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సహకారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. పోడు పట్టాలు ఇచ్చేందుకు 2005 అట హక్కుల చట్టాన్ని అమలు చేయాలన్నారు. అసంఘటిత రంగం కార్మికులకు పీఎఫ్, ఈఎఫ్ఐ చట్టబద్ధత సౌకర్యం కల్పించాలని అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హెచ్పిసి వేతనాలు అమలు చేయాలని అన్నారు. సింగరేణి జెన్ కో ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి బొగ్గు శుద్ధి కర్మాగార పరిశ్రమలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ నుండి భూపాలపల్లి వరకు రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భవనాలకు పక్కా భవనాలు నిర్మించాలన్నారు. జిల్లాలో లేబర్ ఆఫీసు రిజిస్ట్రేషన్ ఆఫీసును ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో బీఈడీ ,ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలన్నారు. మేడిగడ్డ అన్నారం సింగరేణి జెన్కోల కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. గడ్డిగానిపల్లి దుబ్బపల్లి, కాపురం గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చి పునర్నివాసం కల్పించాలని డిమాండ్ చేశారు. వద్ధాప్య ,వికలాంగుల వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని, కనీస వేతనాల జీవో సవరించి ప్రతి ఒక్కరికి కనీస వేతనం రూ.21000 ఇవ్వాలన్నారు. మహిళలకు బాలికలపై జరుగుతున్న అత్యాచారను అరికట్టాలన్నారు .ఇంటి పన్ను ఆర్టిసి విద్యుత్ ఛార్జీల పెంపు విరమించుకోవాలని అన్నారు. అనంతరం పలు తీర్మానాలను ప్రవేశపెడుతూ ప్రభుత్వ అమలు చేసే వరకు భవిష్యత్తు లో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దామెర కిరణ్ ,చెన్నూరి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం దేవేందర్, ప్రీతి, వినరు, శ్రీకాంత్ ,సకినాల మల్లయ్య, రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.