Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
పదవ తరగతిలో విద్యార్థుల ఉత్తమ ఫలితాల దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం, ఉత్తమ ఫలితాల సాధన కోసం జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని అధ్యక్షతన సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ... గిరిజన జిల్లా ములుగులో చాలామంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధికంగా చదువుతు న్నారని అన్నారు. 2022 -23 వార్షిక పరీక్షల్లో ములుగు జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేట్లు సన్నద్ధం చేయాలని కోరారు. పదవ తరగతి ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం నిమిత్తం అన్ని పాఠశాల యాజమాన్య కమిటీ ఎకౌంట్లో డబ్బులు జమ చేశామన్నారు. పోషకాలతో కూడిన అల్పాహారం విధిగా అందించాలని సూచించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్దికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వార్షిక పరీక్షలు సమీపించిన నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం పక్కా ప్రణాళికతో విద్యార్థులకు పునఃశ్చరణ చేయా లని సూచించారు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి విజయమ్మ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి విద్యార్థులకు 6 పేపర్లు మాత్రమే ఉంటాయని, ప్రశ్నా పత్రంపై పట్టు సాధించడం కోసం రెండు సార్లు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డి నేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ అర్షం రాజు, మండల విద్యాశాఖ అధికారులు సామల శ్రీనివాసులు, దివాకర్, సురేందర్, రాజేష్ మరియు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.