Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ భూముల్లో చెట్లను జేసీబీలతో నరికేసిన కబ్జాదారులు
- మామూళ్ల మత్తులో అటవీ అధికారులు!
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల బీరెల్లి- కామారం పరిధిలో 'అంకంపల్లి మంకిడి నరసయ్య కుంటకు అపోజిట్ లో ఉన్న రాంపూర్ బీట్ పరిధిలో జామాయిల్ ప్లాంటేషన్, దాని ప్రక్కన ఉన్న అటవీ ప్రాంతం కబ్జాదారుల గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్నా అటవీ శాఖ కళ్లకు కానరావడంలేదు. కోట్లాది రూపాయల భూములు అన్యాక్రాంతమవుతున్నా ప్రేక్షపాత్రకే పరిమితమవుతోంది. తాడ్వాయి అటవీ ప్రాంతంలో అటవీ శాఖ పనిచేస్తుందా.. అన్న అనుమానాలకు తావిస్తోంది. పోడు భూములుగా చూపి అటవీ భూములను ఆక్రమించేందుకు కబ్జాదారులు సుమారు 15 నుండి 20 ఎకరాలకు పైగా అటవీ స్థలాన్ని ఆక్రమించేశారు. దామరవాయి గ్రామాల పరిధిలో కూడా ఎకరాలకు, ఎకరాలు ఈ భూములు అన్యాక్రాంతం అయింది. ఈ ప్రాంతంలో విలువైన అటవీ సంపద కూడా ఉన్నట్టు ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే వందల ఎకరాలు కబ్జాకు గురి కాగా తాజాగా రాజకీయ పార్టీల నాయకుల అండ అటవీ భూములను ఆక్రమించడంతో ఆ సంపద తరగిపోతోంది. బీరెల్లి- కామారం అటవీ ప్రాంతంలో రాంపూర్ బీట్ పరిధిలో సుమారు 20 ఎకరాలలో ఉన్న చెట్లను వారం రోజుల క్రితం జేసీబీలతో తొలిచేశారు. ఈ విషయం స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలిసిన, పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అటవీ శాఖ అధికారులకు ముడుపులు అందుతున్నట్టు, ఆ కారణంతోనే అటీవీ భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అవినీతికి, లంచగొండితనానికి పాల్పడిన అటవీశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, అన్యాక్రాంతం అవుతున్న అటవీ సందను కాపాడాలని కోరుతున్నారు.