Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత సామరస్యం, ప్రజాస్వామ్యం పరిరక్షణకు జనచైతన్య యాత్ర
- నేటి బహిరంగసభను విజయవంతం చేయాలి : సీహెచ్ రంగయ్య
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
బీజేపీ మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ మతసామరస్యం, ప్రజాస్వామ్య పరి రక్షణ, సామాజిక న్యాయం కోసం పోరాడడంలో భాగంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ జన చైతన్య యాత్రను చేస్తున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య తెలిపారు. గురువారం 'నవతెలంగాణ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జన చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశాన్ని ఆయన వివరించారు. బీజేపీ మతోన్మాదం, కార్పొరే టీకరణ విధానాలతో దేశంలో కేంద్ర ప్రభుత్వం అలజడి సృష్టిస్తుందన్నారు. బీజేపీ అవలంభిస్తున్న ఈ విధానాలను వ్యతిరేకిస్తూ, మత సామరస్యం, ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం ఈ యాత్రను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు యాత్రలు నిర్వహిస్తుండగా, తొలుత మొదటి యాత్ర ఈనెల 17న వరంగల్ జిల్లా నుండి ప్రారంభమవుతుం దన్నారు. ఈ యాత్ర సందర్భంగా శుక్రవారం ఉదయం 10గంటలకు వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆజాంజాహి మిల్లు మైదానంలో జరుగనున్న బహి రంగసభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ యాత్రను సీపీఐ(ఎం) ఆలిండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా జరుగనున్న బహిరంగసభసలో ఆ యన ప్రసంగించనున్నట్లు చెప్పారు. ఈనెల 17వ తేదీ నుండి 29వ తేదీ వరకు యాత్ర నిర్వహిస్తున్న ట్లు చెప్పారు. హన్మకొండ, వరంగల్, మహబూబా బాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుండి ప్రయాణించి ఈనెల 29వ తేదీన హైద్రాబాద్‌కు చేరుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా హైద్రాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ముగింపు బహిరంగసభ జరుగనుందన్నారు. ఈ యాత్రకు రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌రావు నేతృత్వం వహిస్తారన్నారు.
నివేశన స్థలాలకు పట్టాలివ్వాలి
గత 20 ఏండ్లుగా 17 కేంద్రాల్లో పేదలు గుడిసెల్లో నివసిస్తున్నారన్నారు. సుందరయ్యనగర్, పోతననగర్, రఘునాథ్‌నగర్, ఒఎస్ నగర్, ఎన్పిఆర్ నగర్, జ్యోతిబసు నగర్, నానిమియా తోట, డికె నగర్, ఎంహెచ్‌నగర్, నర్సంపేట పట్టణం తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారన్నారు. వీరందరికీ ఇంటి నెంబర్లు వచ్చాయని, ఇంటిపన్ను, నీటిపన్ను చెల్లిస్తున్నందునా వీరందరికీ పట్టాలివ్వాలన్నారు. సుమారు 5 వేల మంది పేదలు గత 20 ఏండ్లుగా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారన్నారు.
తీవ్రమైన భూ పోరాటం
వరంగల్ నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో 2022 మేలో జరిగిన భూ పోరాటం పతాకస్థాయిలో జరిగింది. ఈ పోరాటం నేపథ్యంలో 6 కేంద్రాల్లో 10 వేల గుడిసెలు వేసినట్లు చెప్పారు. ఈ పేదలందరికీ పట్టాలివ్వాలన్నారు. గత ఏడాదిగా గుడిసెల్లోనే పేదలు నివాసముంటున్నారన్నారు. జక్కలొద్ది, తిమ్మాపూర్ శివారులోని బెస్తంచెరువు, ఎంహెచ్న గర్, కొత్తపేట, దేశాయిపేట శివారు, శివనగర్‌లో జరిగిన భూపోరాటంలో పెద్ద సంఖ్యలో పేదలు పాల్గొన్నారన్నారు. నిర్బంధాలు వచ్చిన ఎదుర్కొని అక్కడే నివాసముంటున్నారన్నారు.
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలివ్వాలి
ఇప్పటికే గుడిసెలు వేసుకున్న పేదలకు జీవో 58 ప్రకారం వెంటనే పట్టాలివ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి అర్హులకు రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించిందని, దీన్ని మేం స్వాగతిస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణానికి అర్హులకు రూ.3 లక్షల బదులు రూ.5 లక్షలివ్వాలన్నారు.
బహిరంగసభను విజయవంతం చేయాలి
వరంగల్ ఆజాంజాహి మిల్లు మైదానంలో శుక్రవారం జరుగనున్న భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని రంగయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభలో సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య, చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మీ తదితరులు పాల్గొంటారన్నారు.