Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దెబ్బతిన్న పంటలు.. రైతన్నకు నష్టం..
నవతెలంగాణ-గార్ల/మల్హర్రావు/గోవిందరావుపేట/గణపురం
వాతావరణ పీడన మార్పులతో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో గురువారం ఆకాలంగా వడగళ్ళ వాన కురిసింది. దీంతో పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బ తిన్నాయి. మండల పరిది గోపాలపురం, పినిరెడ్డిగూడెం, ముల్కనూరు, చిన్న కిష్టాపురం, పెద్ద కిష్టాపురం, సీతంపేట, మర్రిగూడెం, రాంపురం, మద్దివంచ, బుద్దారం, పుల్లూరు, పోచారం, శేరిపురం, నగరం, బాలాజీ తండా ల తో పాటు వివిధ గ్రామాల్లో చేతికి అందిన మిర్చి, మొక్కజోన్న,పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అయా గ్రామాల్లో కల్లాల్లో ఆరబోసిన ఎండు మిర్చి వర్షానికి తడిసి ముద్దయ్యాయి. లక్షల రూపాయలు అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టుకోగా ఆకాల వర్షంతో రైతులు పంటలు తీవ్రంగా నష్టపోయారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలంలోని పెద్దతూండ్ల, మల్లారం,తాడిచెర్ల, రుద్రారం గ్రామాల్లో అకాల వర్షం కురవడంతో మిర్చి పంట తడిసి ముద్దయింది. సుమారు రెండు గంటలపాటు కురిసిన వర్షానికి రహదారులు,మురికి కాల్వలు పొంగి పొర్లాయి. గణపురం మండలంలో గురువారం అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా మండల వ్యాప్తంగా వర్షం కురవడంతో ఆరబోసిన మిర్చి. పత్తి తడిసి ముద్దయింది. చేతికి వచ్చే దశలో మిర్చి కల్లాల వద్ద తడిసి ముద్ద కావడంతో రైతులు కన్నీట్లి పర్యంతమ వుతున్నారు. అంతేకాక మామిడి తోటలో కాయలు నేల రాలిపోయాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు వడగళ్లతో కూడిన రాళ్ల వాళ్ళ కురిసింది. మరో రెండు రోజులపాటు వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ వార్తతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు.
నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
అకాలంగా కురిసిన వర్షం కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరహారాన్ని చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ కోరారు. చేతికి అందిన పంటలు వర్షం కారణంగా దెబ్బతిన్నాయాని, తడిసిన మిర్చి పంటలను ప్రభుత్వ మే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు నష్టపోయిన పంటలను సర్వే చేయించి ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించి అన్నదాత లను ఆదుకోవాలని కోరారు.
మద్దతు ధరు కొనుగోలు చేయాలి : రైతులు
తడిసిన, రంగు మారిన మిర్చి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారన, లేదంటే కళ్ళాల్లో అరబోసిన, తొటలపై ఉన్న వేలాది ఎకరాల్లో వేసిన మిర్చి పంట దెబ్బతినడంతోపాటు కోట్ల రూపాయల పంట నష్టం జరగేదని రైతులు వాపోయారు.