Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయశంకర్-భూపాలపల్లిలో నేడు సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర
- హాజరు కానున్న రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రం అంతా ఎరుపు మయమైంది. జిల్లా కేంద్రంలోని 5వ ఇంక్లైన్ నుండి హనుమాన్ దేవాలయం వరకు అదేవిధంగా అంబేద్కర్ సెంటర్ నుండి సుభాష్ కాలనీ వరకు స్వాగత తోరణాలు, సీపీఐ(ఎం) జెండాలతో అలంకరించారు. హాజరుకానున్న తమ్మినేని.. కేంద్ర బిజెపి మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర నేడు జిల్లా కేంద్రానికి రానుంది. ఈ యాత్రలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు, కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, మల్లు లక్ష్మి, సీతారాములు, పాలడుగు భాస్కర్ లతోపాటు పలువురు రాష్ట్ర కమిటీ నాయకులు హాజరు కానున్నారు.
యాత్ర సాగేదిలా....
జిల్లా కేంద్రంలో నేడు జరిగే జన చైతన్య యాత్ర ముం దుగా ములుగు నుండి భూపాలపల్లికి చేరుకుంటుంది. 5వ ఇంక్లైన్ నుండి జయశంకర్, అంబేద్కర్, రాజీవ్ చౌక్ మీదుగా హనుమాన్ దేవాలయం వరకు సాగుతుంది.అక్కడి నుండి డప్పు చప్పుళ్ల, కోలాటాలు, నత్యాలు భారీ బైక్ ర్యాలీ తో తిరిగి అంబేద్కర్ సెంటర్, బస్టాండ్, మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనకాల ఉన్నటువంటి సుభాష్ కాలనీ క్రీడా మైదానంలోని భారీ బహిరంగ సభకు చేరు కుంటుంది.
భారీగా జన సమీకరణ..
నేడు జిల్లా కేంద్రంలో జరిగే జన చైతన్య యాత్రకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణకు ఏర్పాటు చేశారు. గత రెండు రోజు లుగా కురుస్తున్న అకాల వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సుమారు 5,000మంది హాజరయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆధ్వర్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. జిల్లా కేంద్రం లోని సుభాష్ కాలనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనకాల ఉన్న క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జె. వెంకటేష్ పర్యవేక్షించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలకు మంచినీటి వసతి ,సరిపడా కుర్చీలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలు వర్షానికి తడవకుండా రైన్ కోట్స్,లేదా గొడుగులు వెంట తీసుకురావాలని సూచిస్తున్నారు.