Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్, హన్మకొండలో సీపీఐ(ఎం) ప్రారంభ బహిరంగ సభ సక్సెస్
నవతెలంగాణ -మట్టేవాడ/హన్మకొండ/వరంగల్
సీపీఐ(ఎం) జెండాలతో ఓరుగల్లు నగరం ఎరుపుమయమైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సభవైపు సాగిన జన సమూహాన్ని చూసి వరునుడే శాంతించి జన చైతన్య బహిరంగ సభకు అంతరాయం కలిగించకుండా ఆశీర్వదించినట్లు వెనుతిరిగాడు. కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సీపీఐ(ఎం) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన జన చైతన్య యాత్ర ప్రారంభ సభ ఓరుగల్లు నగరంలో విజయవంతమైంది. ఆజంజహీ మిల్లు గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన జన చైతన్య యాత్ర ప్రారంభ బహిరంగ సభకు పేదలు ఎర్రజెండాలు చేత పట్టుకొని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నలువైపులా ఉన్న ప్రధాన కూడళ్లల నుండి కధనరంగానికి కదిలిన సైనికుల్ల ఆటపాటలతో, డప్పు చప్పులతో, కోలాటాలు ఆడుతూ పెద్ద పెద్ద నినాదాలతో హౌరెత్తిస్తూ సభా ప్రాంగణాన్ని ముంచెత్తారు. అనంతరం సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల నిర్ణయాలను వివరించగా శ్రద్ధగా ఆలకించారు. సీపీఐ(ఎం) రంగసాయిపేట ఏరియా కార్యదర్శి మాలోతు సాగర్ ఆధ్వర్యంలో ఆర్టిఏ జంక్షన్ నుండి సభాస్థలి ప్రాంగణం ఆజంజాహి మిల్లు వరకు ఎర్రటి చీరలు, ఎర్రని అంగీలతో రోడ్లను ఎరుపు మయం చేస్తూ భారీ ప్రదర్శన ర్యాలీగా బయలుదేరారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ మీదుగా అండర్ బ్రిడ్జి ప్రాంతం, పోస్ట్ ఆఫీస్, వరంగల్ రైల్వే స్టేషన్ వెంకట్రామ జంక్షన్ మీదుగా మిల్క్ గ్రౌండ్‌కు వేలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జనచైతన్య యాత్ర జరిగే సభా ప్రాంగణానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. అలాగే సీపీఐ(ఎం) కరీమాబాద్ ఏరియా కార్యదర్శి ముక్కెర రామస్వామి ఆధ్వర్యంలో ఎర్రదండు సైనికుల సభాస్థలిక బారీగా చేరుకున్నారు. కోలాటాలు ఆడుతూ డబ్బు చప్పులతో డీజే మోతలతో ఎర్రజెండాలు చేత పట్టుకొని కవాతు నిర్వహిస్తూ కరీమాబాద్ ఉరుసు , మీదుగా ఏజే మిల్స్ గ్రౌండ్లో జన చైతన్య యాత్ర ప్రారంభ బహిరంగ సభ ప్రాంతానికి చేరుకున్నారు. జన చైతన్య యాత్ర ప్రారంభ బహిరంగ సభలో పార్టీ అగ్ర నాయకులు మాట్లాడుతుంటే ప్రజల్లో ఆనందం వెళ్లి విరిసింది. సీపీఐ(ఎం) తమకు అండగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని పార్టీతో కలిసి పోరాటాలు చేసి చిరకాల స్వప్నం అయినా సొంతింటి కలను నెరవేర్చుకుంటామనే భరోసా ప్రజల్లో కనిపించింది. ఎవరిని అడిగిన పార్టీతో పాటు పోరాటాలు చేస్తామనే మాట సభ ప్రాంగణంలో ఎవరిని కలిపినా వినిపించింది.
హన్మకొండ కుడా గ్రౌండ్ ఎరుపుమయం
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలో ప్రారంభమైన జన చైతన్య యాత్ర విజయవంతమైంది. జన చైతన్య యాత్ర అనుకున్న సమయానికి ఉదయం 9గంటలకు కాజీపేట జంక్షన్ నుంచి ప్రారంభమైంది. ఉదయం వర్షం పడుతున్న జనం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చారు. పది గంటల వరకే కుడా గ్రౌండ్స్ నిండిపోయింది. సభ ప్రారంభానికి ముందు సంస్కతిక కార్యక్రమాలు ప్రజల్ని అలరించాయి. సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో ప్రారంభమైన ప్రసంగాలు దాదాపు రెండున్నర గంటల పాటు సాగాయి. సభ ప్రారంభానికి ముందు వర్షం కొద్దిగా వెలిసిన సభ జరుగుతున్నంత సేపు చిరుజల్లులు పడ్డ ప్రజలు సభ విజయవంతానికి పూర్తిగా సహకరించారు. ప్రధానంగా సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల్ని చైతన్య పరచడానికేనని నాయకులు తెలిపారు.
భారీగా తరలొచ్చిన ప్రజలు
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం లోని అజాంజాహి మిల్ గ్రౌండ్లో కొత్తపేట పైడిపల్లి ఎమ్హెచ్నగర్ జక్కలొద్దీ రంగసాయిపేట్ బెస్తం చెరువు వంటి పలు ప్రాంతాల నుండి జనం భారీగా తరలివచ్చారు. సభ వేదికపై కార్యకర్తలను ఉత్సావంతులు చేసే విధంగా పాటలు, నత్యాలు అలరించాయి. ముఖ్య నాయకుల ప్రసంగాలు కార్యకర్తల్లో ధైర్యాన్ని స్థైర్యాన్నిచ్చాయి. వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య అధ్యక్షతన భారి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి పోతినేని సుదర్శన్, కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు జగదీష్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్‌నాయక్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు సింగారపు బాబు, రత్నమాల, భూక్య సమ్మయ్య, కోరబోయిన కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఏం సాగర్, బషీర్, అక్కినపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
మాకు అండగా సీపీఐ(ఎం) ఉంటుంది
హనుమకొండ న్యూ శాయంపేట పరిధిలోని కోట చెరువు దగ్గర మేము గుడిసె వేసుకొని జీవిస్తున్నాం. ఇప్పటికి రెండుసార్లు పోలీసులు బలవంతంగా కాల్చేసినా సీపీఐ(ఎం) నాయకులు మాకు అండగా ఉండి మళ్లీ గుడిసెలు వేయించారు. కచ్చితంగా సీపీఐ(ఎం) మాకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ జాగాలు ఇప్పిస్తుందని నమ్ముతున్నాం. ఇప్పటికే చాలామంది గుడిసెలు వేసుకున్న అర్హులైన పేదలకు ప్రభుత్వ పట్టాలు ఇప్పించారు.
: మూడవత్ జ్యోతి, కుడా చెరువు వద్ద గుడిసెలు వేసుకున్న గృహిణి
ఎర్రజెండా మా అండ
ఎర్రజెండ్ మా అండ. దాదాపు 1500 మంది హనుమకొండ పైడిపల్లి డబ్బాల వద్ద గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాం. మా అందరికీ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలంలో పట్టాలిప్పిస్తారని నమ్మకం ఉంది. సీపీఐ(ఎం) పార్టీకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం.
: అంగిడి రమేష్. వరికోలు గ్రామం పరకాల మండలం
ఎర్రజెండాతోనే మాకు గుడిసెలు వస్తాయి
ఎర్రజెండాతోనే మాకు గుడిసెలు వస్తాయని నమ్మకం ఉంది. జన చైతన్య యాత్ర ప్రారంభ సభకు వచ్చిన తర్వాత ముఖ్య నాయకుల మాటలు వినడం వల్ల మాకు మనోధైర్యం వచ్చింది. ఇండ్లు వచ్చేవరకు ఎర్రజెండా పార్టీలో ఉండి తెగించి పోరాడుదాం.
: రాజు, జక్కలొద్దీ
నేను సైతం జన చైతన్య యాత్రకు
నేను సైతం జనచైతన్య యాత్రకు మేము సైతం అంటూ రెండు సంవత్సరాల బాబుతో తన తల్లి రావడం అక్కడికి వచ్చిన పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఒక కూతురు ఒక కొడుకుతో సభా ప్రాంగణానికి వచ్చాను. ఈ సభలో ముఖ్య నాయకులు మాట్లాడిన మాటలు వింటుంటే బీజేపీ ప్రభుత్వంను గద్దెకించే వరకు పోరాడుదామనే పోరాట పటిమ వచ్చంది. ముఖ్య నాయకులు అన్న మాటలు ఆసక్తిని కల్పించాయి. నిత్యవ సర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే నిరుపేదల బతుకులు మరింత దారిద్రంలోకి వెళ్తున్నాయి. బీజేపీ గద్దె దింపుటకే నేను సైతం పోరాటంలో ఉంటాను.
: ఓడపల్లి అనిత బెస్తం చెరువు
ఎర్రజెండా అండతోనే హక్కులు సాధిస్తాం
ప్రజల హక్కులు దినదినం కోల్పోతున్నాం. ఎర్రజెండా అండతోనే మహిళల హక్కులను సాధించుకుంటాం. కులం, వర్గం మతం అసమానతలు బిజెపిలో పెట్రేగిపోతున్నాయి. మహిళలపై హత్యలు అత్యాచారాలు, నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రాకుండా ఐక్యమత్యంతో అందరం ఉద్యమించాలని ముఖ్య నాయకులు చెప్పిన మాటలు మాలో పోరాటపటిమను పెంపొందించాయి.
: యాస్మిన్ కాశిబుగ్గ