Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాలిన మామిడి మొక్కజొన్న, పత్తికిఅపార నష్టం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలతో పంటలకు, తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం కురిసిన అకాల వర్షాలు, గాలి దుమారానికి మామిడి కాయలు నేలరాలాయి. కల్లాల్లో మిర్చి తడిసి ముద్దయ్యింది. మొక్కజొన్న నేలవాలింది. వరంగల్ జిల్లాలో 13 మండలాల్లో 43 వేల 423 మంది రైతులకు చెందిన 57 వేల 855 ఎకరాల్లో పంట దెబ్బతింది. మొక్కజొన్న, వరి, పత్తి, వేరుశనగ, మామిడి తదితర పంటలు అకాల వర్షాలకు దారుణంగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొక్కజొన్న 48,101 ఎకరాలు, పత్తి 31, వరి 9,450, వేరుశనగ 16, జొన్న 8, మామిడి 249 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. హన్మకొండ జిల్లాలో 3,617 మంది రైతులకు సంబంధించి 5,672 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వరికి సంబంధించి 602 మంది రైతులు 946 ఎకరాల్లో పంటను నష్టపోయారు. 3,015 మంది రైతుల 4,626 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్ జిల్లాలో మామిడి తోటలు 249 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. 163 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షాలతో పంటలకు, తోటలకు అపారనష్టం వాటిల్లింది. మొక్కజొన్న చేన్లు నేలవాలాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. వరి పొలాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. హన్మకొండ జిల్లా కంటే వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు, వడగండ్లతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వరంగల్ జిల్లాలో 13 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖాధికారులు వడగండ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయి నష్టాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందించాల్సి వుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో పంట నష్టాలను స్వయంగా పరిశీలించి రైతులను ఓదార్చారు. నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేష్, పరకాల నియోజకవర్గంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పంట నష్టాలను స్వయంగా సందర్శించి రైతులకు ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని రైతులకు భరోసానిచ్చారు. మామిడి తోటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. గతంలో వడగండ్ల వర్షాలతో నష్టం వాటిల్లిన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈసారి భారీ నష్టం జరిగినందునా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఐనవోలు మండలంలో రైతుసంఘం ప్రతినిధులు దెబ్బతిన్న పంటలను సందర్శించి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మామిడి తోటలకు అపార నష్టం
వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలంలో 225 ఎకరాల్లో, రాయపర్తి మండలంలో 24 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. వర్ధన్నపేట మండలంలో 151 మంది మామిడి రైతులు నష్టపోయారు. రాయపర్తి మండలంలో 12 మంది రైతులకు నష్టం వాటిల్లింది.
పత్తి పంట నష్టం
వరంగల్ జిల్లాలో అకాల వర్షాలతో వరంగల్, నర్సంపేట, ఖిలా వరంగల్ మండలాలల్లో 23 మంది రైతులకు చెందిన 31 ఎకరాల్లో పత్తి చేన్లు దెబ్బతిన్నాయి. వరంగల్‌లో 3 ఎకరాలు, నర్సంపేటలో 8 ఎకరాలు, ఖిలా వరంగల్‌లో 20 ఎకరాలలో పంటకు నష్టం వాటిల్లింది.