Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త అభ్యర్థి రంగంలోకి.. ముగ్గురి మధ్య తీవ్ర పోటీ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కారు పార్టీలో కాక పుట్టింది. ఇద్దరు మాజీ డిప్యూటీ సిఎంలు కడియం శ్రీహరి, డాక్టర్ తాటికొండ రాజయ్యల మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ కుట్రలు వెరసి వారిద్దరిని కాదని మూడో వ్యక్తిని బరిలోకి దించుతారా ? అంటే అవుననే ప్రచారమే బలంగా సాగుతుంది. రఘునాధపల్లి మండలం ఖిలాషపూర్కు చెందిన డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు 'స్టేషన్' బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జనగామ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 'పగిడిపాటి' తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నాటి నుండి కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో 'స్టేషన్' నుండి పార్టీ టికెట్నాశిస్తున్నారు. 'కడియం', 'తాటికొండ'ల రాజకీయాలతో విసిగిపోయిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో సైతం వారిద్దరిని పక్కనపెట్టి కొత్త అభ్యర్థికి అవకాశమిస్తే బాగుంటుందన్న చర్చ కూడా సాగుతుండడం గమనార్హం. బిఆర్ఎస్ కీలక నేతలతో తనకున్న సన్నిహిత సంబంధాలతో 'పగిడిపాటి' పార్టీ టికెట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ముగ్గురు హౌరాహౌరీ తలపడుతున్నారు. మరి టికెట్ వరించెదెవరికో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం రాజకీయాలు ఎప్పుడూ వేడెక్కుతూనే వుంటాయి. ఈ నియోజకవర్గం నుండి ఇద్దరు మాజీ డిప్యూటీ సిఎంలు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యలిద్దరి మధ్య రాజకీయ వైరం వుండడం, వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్న విషయం విదితమే. ఇదిలావుంటే తాజాగా ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ నవ్య నేరుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎమ్మెల్యే రాజయ్యపై చేయడం రాజకీయ దుమారాన్ని సృష్టించింది. ఈ వ్యవహారం 'తాటికొండ'ను ఇరుకునపెట్టింది. పార్టీ సీరియస్ కావడంతో ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య నేరుగా సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నన్ను రాజకీయంగా అణిచివేయడానికే నాపై రాజకీయ కుట్ర చేశారని ఎమ్మెల్యే రాజయ్య, 'కడియం'పై ఆరోపణలు చేశారు. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఈ వ్యవహారంపై పార్టీ నాయకత్వం సీరియస్‌గా వున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలావుంటే ఇప్పటికే నియోజకవర్గంలో బిఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలి వుంది. ఈ ఇద్దరు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటుండ డంతో అటు పార్టీ వర్గాలు, ఇటు ప్రజలు సైతం విసిగిపో యారు. ఈ క్రమంలో వీరిద్దరు కాకుండా కొత్త అభ్యర్థిని రంగంలోకి దించితే బాగుంటుందన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రఘునాధపల్లి మండలం ఖిలాషపూర్కు చెందిన డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్‌రాజు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ల జెఎసిలో 'పగిడిపాటి' చురుకైన పాత్రను పోషించారు. వివాదరహితుడు, విద్యావంతుడు, ఉద్యమకారుడు కావడంతో 'పగిడిపాటి'ని రంగంలోకి దించితే గెలుసు సులువవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు సేకరించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇద్దరు మాజీ డిప్యూటీ సిఎంల ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు విసిగిపోయారు. 'కడియం' అనుభవాన్ని జాతీయ రాజకీయాల్లో వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఎమ్మెల్యే రాజయ్యపై వచ్చిన ఆరోపణలు, క్షేత్రస్థాయిలో వున్న వ్యతిరేకత నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించితే బాగుంటుందన్న ఆలోచనలో పార్టీ వుందన్న చర్చ పార్టీలో జరుగుతుంది.
ఉద్యమ నేపథ్యంతో రంగంలోకి..
ఉద్యమ నేపథ్యంతో ఈసారి 'స్టేషన్' బరిలో నిలవాలని డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్‌రాజు తీవ్రంగా ప్రయత్నిస్తు న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో డాక్టర్ల జెఎసిలో 'పగిడిపాటి' కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కు మార్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావుతో 'పగిడిపాటి'కి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికి ఆయన సిద్దమవుతున్నారు. ప్రస్తుతం జనగామ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెం ట్‌గా వ్యవ హరిస్తున్నారు. ఆయన సతీమణి జనగామ మున్సిపాల్టీలో కౌన్సిలర్‌గా వున్నారు. బిఆర్ఎస్ ఆవిర్భావం నుండి 'పగిడిపాటి' చురుకైన పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్‌రాజు పార్టీ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతుండడంతో నియోజకవర్గంలో ముగ్గురు నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం హౌరాహౌరీగా తలపడుతున్నారు.