Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాజీపేటలో 'జంగా' కార్యక్రమాలు అధిష్టానానికి 'నాయిని' ఫిర్యాదు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్‌లో మళ్లీ డిసిసి హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, జనగామ డిసిసి అధ్యక్షులు జంగా రాఘవరెడ్డిల మధ్య మళ్లీ రచ్చ మొదలైంది. మంగళవారం 'జంగా' పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట ప్రాంతంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతంలో ఇలాగే పాల్గొన్నందుకే టిపిసిసి క్రమశిక్షణా సంఘం ఆయన్ను మందలించింది. జనగామ జిల్లాలోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని, హన్మకొండ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటే హన్మకొండ డిసిసి అధ్యక్షుడి అనుమతితో చేయాలని ఆదేశించింది. నాడు వెనక్కి తగ్గిన 'జంగా' తాజాగా మళ్లీ కాజీపేట ప్రాంతంలో తన అనుచరులతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా 'పశ్చిమ' నుండే పోటీ చేస్తానని, 'నాయిని' స్థానికేతరుడని వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య రగడ మళ్లీ షురూ అయ్యింది. 'జంగా' వ్యవహారంపై 'నాయిని' పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్‌లో మళ్లీ జనగామ డిసిసి అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి, హన్మకొండ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య పోరు మొదలైంది. గతంలో 'జంగా' వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండే పోటీ చేయనున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై 'నాయిని' పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో టిపిసిసి క్రమశిక్షణా సంఘం సీరియస్‌గా స్పందించింది. జనగామ జిల్లాలోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని, హన్మకొండ జిల్లాలో నిర్వహించాలంటే హన్మకొండ డిసిసి అధ్యక్షుడి అనుమతి తప్పనిసరని 'జంగా'కు స్పష్టం చేసింది. ఈ క్రమంలో వెనక్కి తగ్గిన 'జంగా' గత రెండ్రోజులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మళ్లీ వివాదం ఉత్పన్నమైంది.
'నాయిని' స్థానికేతరుడు : జంగా
హన్మకొండ డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి స్థానికేతరుడని, వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ నాకే వస్తుందని, నేనే గెలుస్తానని జంగా రాఘవరెడ్డి కాజీపేటలో పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. నేను స్థానికుడినని, నియోజకవర్గంలో పట్టుందని 'జంగా' చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై 'నాయిని' వర్గం తీవ్ర ఆగ్రహంతో వుంది. 'జంగా' గత ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టిపిసిసి 'జంగా'కు జనగామ డిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. నాటి నుండి జనగామ జిల్లా పార్టీ కార్యక్రమాలను నిర్వహించిన 'జంగా' తాజాగా వచ్చే ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో 'నాయిని', 'జంగా'ల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. అంతేకాకుండా 'జంగా' కాజీపేట ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్ని డివిజన్లలో పర్యటించే ప్రయత్నంలో వుండగానే 'నాయిని' టిపిసిసికి ఫిర్యాదు చేశారు. టిపిసిసి ఆదేశాలతో క్రమశిక్షణ సంఘం రంగ ప్రవేశం చేసి 'జంగా'ను కట్టడి చేసింది. తాజాగా మళ్లీ 'జంగా' వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తన కార్యక్రమాలను పున:ప్రారంభించడంతో మళ్లీ రెండు వర్గాల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది.
'జంగా'పై 'నాయిని' ఫిర్యాదు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో హన్మకొండ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి టిపిసిసి నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. గతంలో ఫిర్యాదు చేశాక క్రమశిక్షణా సంఘం స్పందించి 'జంగా'ను కట్టడి చేసిన విషయం విదితమే. ఇదిలావుంటే 'నాయిని' రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రారంభించిన నాటి నుండి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో పాదయాత్రను నిర్వహిస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిన హామిలు, స్థానికంగా ప్రధాన సమస్యలను పరిష్కరించకపోవడంపై విమర్శలు చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 'జంగా' వ్యాఖ్యలతో 'నాయిని' వర్గంలో కలకలం రేగింది. తాజాగా మళ్లీ 'నాయిని' టిపిసిసి నాయత్వానికి 'జంగా'పై ఫిర్యాదు చేయడంతోపటు ఆయన చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను కూడా పంపినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో 'పశ్చిమ' నియోజకవర్గంలోని కాంగ్రెస్ వర్గాల్లో అలజడి ప్రారంభమైంది. ఏదేమైనా ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎంత తొందరగా స్పష్టతనిస్తే అంత మంచిదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.