Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రశ్నించే గొంతుకను బీజేపీ ప్రభుత్వం నొక్కుతోందని మండల ఎంపిపి చింతలపల్లి మల్హర్రావు ఆరోపించారు. జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా మండల కేంద్రమైన తాడిచెర్లలో నిరసన చేపట్టి మాట్లాడారు మోడీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టిందన్నారు.నేడు పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బిజెపి అదానీకి కట్టబెడుతుందన్నారు.ఆదానీ ముసుగులో బీజేపీ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందని రాహుల్ అప్పుడే చెప్పారన్నారు. హిండెన్ బర్గ్ నివేదికతో మోదీ, ఆదానీ బండారం బయటపడిందని భయం పట్టుకుందన్నారు.మోదీ, అమిత్ షా లు డొల్ల కంపెనీలతో ఆదానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టారని, దీనిపై ఈడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేసేందుకు వెళితే రాహుల్ ను అడ్డుకున్నారని గుర్తు చేశారు. పార్లమెంటులో అక్రమాలపై చర్చించాలని పట్టుబడితే రాహుల్ పై రాజకీయ కక్షతో అనర్హత వేటు వేశారన్నారు.ఆదానీ ఇంజన్‌కు రిపేరు వచ్చిందని ప్రధానికి భయం పట్టుకుందన్నారు. పప్పు అని అవహేళన చేసిన బీజేపీకి రాహుల్ నిప్పు అని తెలుసుకున్నారని... అందుకే రాజకీయ కక్షతో రాహుల్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారని ఆదానిపై నిలదీసినందుకే ఆదరబాదరాగా రాహుల్ పై అనర్హత వేటు వేశారన్నారు.కాంగ్రెస్ పునాదులతోనే ఈ దేశానికి ప్రపంచంలో గుర్తింపు వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ వొన్న తిరుపతి రావు,నాయకులు కేశారపు చెంద్రయ్య, నర్సింగరావు,ఆకుల శ్రీనివాస్,మేనం సతీష్,పుప్పాల రాజు,ఇందారపు ప్రభాకర్, బూడిద రాజా సమ్మయ్య,మాచర్ల మదు, బిర్నేని దుర్గాప్రసాద్,శ్రీనివాస్ పాల్గొన్నారు.