Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 42 కోట్ల నిధులతో పాత్రికేయుల సంక్షేమానికి ప్రెస్ అకాడమీ కృషి
- ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
- జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తా
- ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
జర్నలిస్టుల సంక్షేమం, నైపుణ్య అభివద్దే లక్ష్యంగా ప్రెస్ అకాడమీ పనిచేస్తుందని రాష్ట్ర అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.శనివారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో జిల్లాలోని పాత్రికేయులకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ జక్కుల శ్రీహర్షిని తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్నారని, గ్రామాలలో జరుగుతున్న అంశాలను సైతం బయటకు తీసుకువచ్చి ప్రజల శ్రేయస్సు కోసం నిస్వార్ధంగా కషి చేస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు 32 వేలకు పైగా అక్రిడియేటర్ జర్నలిస్టులు ఉన్నారని, మండల స్థాయి నుంచి ప్రభుత్వం జర్నలిస్టులను గుర్తించి అక్రిడేషన్లు జారీ చేసిందని తెలిపారు. పాత్రికేయులు మండల స్థాయి సమస్యలు ప్రజల ఆశలు ఆశయాలు, అక్కడ జరుగుతున్న అభివద్ధి అంశాలు ప్రజలకు జరుగుతున్న అన్యాయం అక్రమాలు సంబంధిత సంపూర్ణ వివరాలు తెలియజేస్తూ వార్తలు రాయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది పాత్రికేయులు జీతాలు లేకుండా పనిచేస్తున్నారని, ప్రస్తుతం పోటీ ప్రపంచంతో పోటీపడుతూ వార్తలు సేకరించాల్సి ఉంటుందని, జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా వారి నైపుణ్యాలు అభివద్ధి చేసేందుకు ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని, ఉమ్మడి జిల్లాల పరిధిలో శిక్షణ తరగతులు ముగించామని, ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులపాటు నిష్ణాతులైన ప్రతినిధులచే శిక్షణ అందించడం జరుగుతుందని దీన్ని పాత్రికేయులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఏర్పాటుచేసి 42 కోట్ల నిధులు కేటాయించిందని, రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రెస్ అకాడమీ ద్వారా దాదాపు 500 పైగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద ప్రతి కుటుంబానికి 2.5 లక్షలు అందించామని, కరుణ సమయంలో 4000 మంది జర్నలిస్టులకు దాదాపు ఏడు కోట్ల ఆర్థిక సహాయం చేశామని ఆయన తెలిపారు. జర్నలిస్టులు నైతికతతో ఉండాలని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని, ప్రస్తుత సమయంలో అధికంగా మిస్ ఇన్ఫర్మేషన్ తప్పుడు వార్తలు అధికమవుతున్నాయని, దీని నివారణకు జర్నలిస్టులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే అనేక జిల్లాలో స్థానిక నాయకులతో సమయం చేసుకుని అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఎంపిక చేసి పంపిణీ చేశామని, అదేవిధంగా భూపాలపల్లి లో ఎమ్మెల్యే గారితో సమావేశం చేసుకుంటూ అర్హులైన వారికి ఇంటి స్థలాలు అందేలా సమన్వయంతో జర్నలిస్టులు కషి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ప్రభావితం చేసే విధంగా వార్తలు రాసి రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పాత్రికేయులు పోషించారని ఆయన అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అనంతరం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నాయకత్వంలో జర్నలిస్టులకు ప్రత్యేక దష్టి సారిస్తున్నారని అన్నారు. మీడియా మిత్రులు ఉద్యమ సమయంలో పత్రికల్లో రాయడం వేరు,ప్రభుత్వాల మీద ప్రభావితం అయ్యే విధంగా రాయడం వేరని అందరిని సమదష్టితో చూస్తూ వార్తలు రాయాలని ఆయన కోరారు.
భారత దేశంతో పాటు చాలా దేశాలకు స్వతంత్రం వచ్చినప్పటికీ భారత దేశ ప్రజాస్వామ్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగం లో ఉన్న స్వేచ్ఛ మరియే ఇతర దేశాల్లో లేదని, ఆ స్వేచ్ఛను కొందరు మీడియా మిత్రులు దుర్వినియోగం చేసుకుంటు పత్రిక విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీల నేతలు కానీ,అధికార పార్టీ నేతలు కానీ చెప్పే ప్రతి వాక్యాన్ని అలాగే రాయడం పట్ల పలుమార్లు మనోభావాలు దెబ్బతింటున్నాయన్న విషయాన్ని ఈ శిక్షణ ద్వారా తెలియజేయాలని, అలాంటి పదాలు వాడకుండా ఉండాలని ఆయన సూచించారు. భూపాలపల్లి జిల్లా మీడియా మిత్రులకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా గెలిచిన అనంతరం పాటించాల్సిన విధివిధానాలపై శిక్షణ అందిస్తారని, అదేవిధంగా జర్నలిస్టుల పాత్ర, వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకు చేయాల్సిన పనులు తదితర అంశాల పై ప్రెస్ అకాడమీ ద్వారా అందిస్తున్న నైపుణ్య అభివద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ ఓ.ఎస్డీ రహేమాన్, మేనేజర్ వెంకటేశం జర్నలిస్టు నాయకులు మారుతి సాగర్, విష్ణువర్ధన్ రెడ్డి, బి.ఆర్.లెనిన్, వెంకన్న, రాజనారాయణ, వి.వెంకటరమణ, వంశీ క్రిష్ణ, శ్యామ్ అధ్యాపకులు ,సీనియర్ జర్నలిస్టులు శ్రీ చిల్ల మల్లేశం, శ్రీ బుచ్చన్న మున్సిపాల్ చైర్మన్ శ్రీమతి సెగ్గం వెంకట రాణి సిద్దూ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ ,వైస్ చైర్మన్ కల్లెపు శోభ రఘుపతిరావు, మున్సిపాల్ చైర్మన్ శ్రీమతి సెగ్గం వెంకట రాణి,కాటారం సొసైటీ చైర్మన్ చల్ల నారాయణ , జిల్లా మీడియా ప్రతినిధులు, పాల్గొన్నారు.