Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహ్వానం అందకపోవడంపై 'కడియం' అసంతృప్తి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అసమ్మతిరాగం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవ ర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య విభేధాలు మరోమారు బహిర్గతమయ్యాయి. ఇటీవల వేలేరు మండలంలో జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్లను ఆహ్వానించారే కాని ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని ఆహ్వానించకపోవడంపై 'కడియం' తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గం నుండి గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన తనను ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ ఎపిసోడ్ మరిచిపోకముందే మళ్లీ బీఆర్ఎస్లో ముసలం ప్రారంభమైంది. ఎన్నికలు వస్తున్న తరుణంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి అందరినీ కలుపుకుపోవాలని సూచించినా, భిన్నంగా 'స్టేషన్'లో జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గ బీఆర్ఎస్లో అసమ్మతి నిత్యం చర్చనీయాంశంగా మా రుతుంది. ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య, జానకీ పురం సర్పంచ్ల వివాదం మరిచిపోకముందే తాజాగా మళ్లీ 'కడియం' స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం చర్చనీ యాంశంగా మారింది. బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వాలు ఆత్మీ య సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. తాజాగా వేలేరులో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి 'కడియం'ను ఆహ్వా నించకపోవడంపై 'కడియం' ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల విషయంలో, ఎన్నికలలో సహాయం తీసుకొని అధి కారిక, పార్టీ కార్యక్రమాల్లో మాత్రం నన్ను ఆహ్వానించడం లేదని, ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టిలో వుందని స్పష్టం చేశారు. వేలేరులో జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య ఛీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్‌ను, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజే శ్వర్రెడ్డిని ఆహ్వానించారు. ఈ సమావేశానికి 'కడియం'ను ఆహ్వానించలేదు. ఈ విషయంపై 'కడియం' తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆత్మీయ సమ్మేళనం..
బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంతో నియోజకవర్గాల్లో పార్టీలో ఐక్యత ఏర్పడడానికేనని ఏర్పాటు చేస్తున్నారని, అటు వంటి ఆత్మీయ సమ్మేళనానికే నన్ను ఆహ్వానించకపోవడం పట్ల 'కడియం' అసహనం వ్యక్తం చేశారు. ఈ నియోజ కవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య, మరోవైపు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పార్టీ టికెట్నాశి స్తున్నారు. వీరిద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రెండోసారి శాసనసభ ఎన్ని కల్లో పార్టీ టికెట్ కోసం 'కడియం' తీవ్రంగా పట్టుపట్టారు. పార్టీ అధిష్టానం 'కడియం'ను బుజ్జగించి ఎమ్మెల్సీ పదవిని కట్టపెట్టింది. కేబినెట్లోకి మాత్రం 'కడియం'ను తీసు కోలేదు. ఈ విషయంలో 'కడియం' వర్గంలో అసంతృప్తి వున్నా ఆ వర్గం సంయమనం పాటిస్తుంది. వచ్చే ఎన్నిక ల్లోనైనా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని 'కడియం' ఇప్పటి నుండే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. వేలేరులో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభ 'తాటికొండ', 'కడియం'ల మధ్య బలప్రదర్శనగా మారిన విషయం విదితమే. ఈ బహిరంగసభ సందర్భంగా ప్రజలు 'కడియం' వైపు వున్నట్లు కనిపించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల్లో 'కడియం'ను ఒంటరి చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తు న్నారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఇద్దరు నేతల మధ్య ఎత్తులు, పైఎత్తులతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే వేలేరులో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి 'కడియం'ను 'తాటికొండ' ఆహ్వానించలేదని పలువురు సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయంలో 'కడియం' వర్గం తీవ్ర ఆగ్రహంతో వుంది. ఈ విషయంలో 'కడియం' వర్గం పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అందుకే 'కడియం' ఈ విషయంలో సీఎం దృష్టిలో వుందని స్పష్టం చేశారని పరిశీలకులు భావిస్తు న్నారు. ఏదేమైనా ఈ తాజా వివాదం మరోమారు 'స్టేషన్'లో రాజకీయ వేడిని పెంచింది.